టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే, పవన్ వైపు మరో ఎంపీ..

ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికర మలుపులు తీసుకుంటోంది. వైసీపీలో సీట్ల ఖరారు వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి కృష్ణాజిల్లాలో మార్పులు, చేర్పుల ప్రక్రియ దాదాపు ఒక కొలిక్కి వచ్చింది. ఒక ఎంపీ, మరో సీనియర్ ఎమ్మెల్యే వ్యవహారం మాత్రం సమస్యగా మారుతోంది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పార్టీలో కొనసాగుతారా లేదా అనే చర్చ మొదలైంది. సీనియర్ ఎమ్మెల్యే పార్ధసారధిని ఎంత బుజ్జగించినా టీడీపీలోకి వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 

మార్పులు చేర్పులు: ఉమ్మడి కృష్ణాజిల్లాలో వైసీపీ అభ్యర్దుల ఎంపిక తుది దశకు చేరుకుంది. పెనమలూరు సీటు పైనే ఇంకా స్పష్టత రావటం లేదు. జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎంఓలో సుదీర్ఘ మంతనాలు జరిగాయి. ఈ సమయంలో ఇప్పటికే చేసిన మార్పులు మినహా కొత్తవి తెర మీదకు రాలేదని తెలుస్తోంది.

 

పెనమలూరు ఎమ్మెల్యే పార్ధసారధితో పార్టీ ప్రాంతీయ సమన్వయ కర్తలు రెండు విడతలుగా సమావేశం నిర్వహించారు. పార్ధసారథిని మచిలీపట్నం పార్లమెంటు స్థానంలో పోటీ చేయాలని అధిష్టానం పెద్దలు సూచించారు. మంత్రిగా తనకు అవకాశం ఇవ్వలేదన్న అసంతృప్తితోపాటు ఈసారి వైసీపీ అధికారంలోకి రావడం కష్టమేనన్న ఆలోచనలో ఉన్న సారథి టీడీపీలోకి వెళ్లేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది.

 

టీడీపీలోకి పార్ధసారధి: ఈ నెల 18న గుడివాడలో జరిగే చంద్రబాబు సభలో పార్ధసారధి టీడీపీలో చేరుతారని తెలుస్తోంది. జగన్ తనను గుర్తించకపోయినా పెనమలూరు ప్రజలు మాత్రం గుండెల్లో గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని పేర్కొన్నారు. పార్టీ పెద్దల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సారథి పార్టీ మార్పు ఖాయంగా కనిపిస్తోంది.

 

మరోవైపు వల్లభనేని బాలశౌరి కూడా పార్టీ మారతారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఇప్పటికే సినీ దర్శకుడు వివి నాయక్ ను రంగంలోకి దించటానికి అధిష్టానం యత్నించినట్టు సమాచారం. టీడీపీ, జనసేన, బీజేపీ కలిస్తే.. సామాజిక కార్డుతో బాలశౌరి జనసేనలో కలుస్తారని మచిలీపట్నం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే తాము వైసీపీకి దూరం కానున్నట్టు బాలశౌరి అనుచర వర్గం ప్రచారం ఊపందుకుంది.

 

బాలశౌరి దారెటు: మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అభ్యర్థిత్వాన్ని నియోజకవర్గ పరిధిలో మెజార్టీ శాసనసభ్యులు వ్యతిరేకిస్తున్నారు. ఆయన స్థానంలో మరొకరికి కేటాయించాలని గతంలోనే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఎవరు ఎన్ని రాజకీయాల చేసిన తిరిగి మచిలీపట్నం నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ఎంపీ బాలశౌరి ప్రకటించారు. అయితే, ఎమ్మెల్యే పార్ధసారధిని ఎంపీగా పోటీ చేయాలనే పార్టీ ప్రతిపాదనతో ఇప్పుడు బాలశౌరి కి స్థానం లేదనే వాదన వినిపిస్తోంది.

 

అయితే, ముఖ్యమంత్రికి సన్నిహిత నేగా బాలశౌరికి గుర్తింపు ఉంది. ఇక..ఇంచార్జ్ ల మార్పులో భాగంగా మూడో జాబితా ఈ రోజు పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పుడు ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే పార్ధసారధి విషయంలో ఎలాంటి నిర్ణయాలు వస్తాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Posted Under AP
Editor