తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పెట్టుబడులపై దృష్టి సారించారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు తీసుకుంటోన్నారు. పారిశ్రామిక, ఐటీ విధానాలపై కసరత్తు సాగిస్తోన్నారు. త్వరలోనే దీన్ని ప్రకటించే అవకాశం ఉంది.
పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో ఆయన త్వరలోనే దావోస్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. దావోస్‌లో ఏర్పాటయ్యే ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరు కానున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా వెలువడింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆయన విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లబోతోండటం ఇదే తొలిసారి.
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రతి సంవత్సరం ప్రపంచ ఆర్థిక సదస్సు ఏర్పాటవుతుంటుందనే విషయం తెలిసిందే. వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు, మల్టీ నేషనల్ కంపెనీల కంపెనీల అధినేతలు, పెట్టుబడిదారులు హాజరవుతుంటారు. భారత్ నుంచి ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్ర, కుమారమంగళం బిర్లా, గౌతమ్ అదాని.. వంటి పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు క్రమం తప్పకుండా హాజరవుతుంటారు.
కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సదస్సులో పాల్గొంటుంటారు. తమ రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకుని రావడానికి ప్రయత్నాలు సాగిస్తుంటారు. ఈ ఏడాది దావోస్ సదస్సుకు రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు ఆయన దావోస్‌లో పర్యటిస్తారు.
ఈ పర్యటనలో ఆయన వెంట ముఖ్యమంత్రి కార్యదర్శి వీ శేషాద్రి, ప్రత్యేక కార్యదర్శి బీ అజిత్ రెడ్డి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పెట్టుబడుల వ్యవహారాల విభాగం ప్రత్యేక కార్యదర్వి విష్ణువర్ధన్ రెడ్డి, మీడియా ప్రతినిధి కర్రి శ్రీరామ్, ముఖ్య భద్రతాధికారి తస్ఫీర్ ఇక్బాల్, ఉదయ సింహా, గుమ్మి చక్రవర్తి వెళ్తారు.
