చంద్రబాబును వరుస కేసులు వెంటాడుతున్నాయి. స్కిల్ కేసులో తాజాగా చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పై సుప్రీంలో తీర్పు వెల్లడి కావాల్సి ఉంది. ఇదే సమయంలో చంద్రబాబు పైన నమోదు చేసిన లిక్కర్ కేసులో సీఐడీ దూకుడు పెంచింది. చంద్రబాబు కనుసన్నల్లోనే మద్యం కుంభకోణం జరిగిందని నిర్దారణకు వచ్చింది. నోట్ ఫైళ్ల పైన చంద్రబాబు..నాటి మంత్రి కొల్లు రవీంద్ర సంతకాలు ఉన్నట్లు స్పష్టం చేస్తున్నారు.
కేసు నమోదుతో : చంద్రబాబు పైన ఇప్పటికే సీఐడీ మద్యం కుంభకోణం కేసు నమోదు చేసింది. ఈ కేసులో సీఐడీ విచారణలో ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా… కేబినెట్‌కు తెలియకుండా… అస్మదీయులకు చెందిన బెవరేజీలు, మద్యం దుకాణాలు, బార్లకు అడ్డగోలుగా ప్రయోజనం కల్పించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. అందుకోసం 2012 నుంచి మద్యం దుకాణాలపై ఉన్న 8శాతం తో పాటుగా అదనంగా జీఎస్టీ, బార్లపై ఉన్న 9శాతం ప్లస్ జీఎస్టీ ప్రివిలేజ్ ఫీజును తొలగిస్తూ రెండు చీకటి జీవోలు జారీ చేశారు. తద్వారా ఖజానకు రూ.1,299.64 కోట్ల మేర గండి కొట్టారు. అందుకు మార్గం సుగమం చేస్తూ సంబంధిత నోట్ ఫైళ్లపై అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర డిజిటల్ సంతకాలు చేసినట్టు అధికారిక రికార్డులు వెల్లడిస్తున్నాయి.
కొత్త మద్య విధానం ద్వారా : 2015లో చంద్రబాబు ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని తీసుకువచ్చింది. అందుకు కేబినెట్ సమావేశం ముందు అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ఓ నోట్ ఫైల్‌ను ప్రభుత్వానికి పంపారు. మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును కొనసాగించడమే కాకుండా 10 రెట్లు పెంచాలని ప్రతిపాదించారు. కానీ ఆ ప్రతిపాదనను చంద్రబాబు ప్రభుత్వం కేబినెట్ దృష్టికే తీసుకువెళ్ల లేదు. నూతన మద్యం విధానంపై కేబినెట్ సమావేశంలో చర్చించి 2015, జూన్ 22న జీవోలు 216, 217 జారీ చేసింది. కానీ ఆ రెండు జీవోల్లో మద్యం దుకాణాల(ఏ4 షాపులు)కు ప్రివిలేజ్ ఫీజు తొలగిస్తున్నట్టు కనీసం పేర్కొన లేదు. కానీ అదే రోజు సాయంత్రం అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ప్రభుత్వానికి ఓ నోట్ పంపారని గుర్తించారు. అందులో మద్యం దుకాణాలపై ప్రివిలేజ్ ఫీజు తొలగించాలని ప్రతిపాదిస్తూ అందుకోసం ఎక్సైజ్ చట్టంలోని 16(9) నిబంధనను రద్దు చేయాలని సిఫార్సు చేసారని విచారణలో తేలినట్లు సమాచారం.
విచారణలో కొత్త అంశాలు : ఆ నోట్ ఫైల్‌ను చంద్రబాబు కార్యాలయానికి పంపారు. ఆమేరకు ‘కాపీ టు పీఎస్ టు సీఎం’ అని నోట్‌ఫైల్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ప్రివిలేజ్ ఫీజు తొలగిస్తున్న విషయం చంద్రబాబుకు పూర్తిగా తెలుసని విచారణలో తేల్చారు. కానీ ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తున్న విషయం చంద్రబాబుకు కనీసం తెలియదనే వాదన ఉంది. ఇక చంద్రబాబు ఆమోదంతోలనే ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ టీడీపీ ప్రభుత్వం అదే రోజు అంటే 2015, జూన్ 22 సాయంత్రం జీవో 218 జారీ చేసింది. కేబినెట్‌లో చర్చించి జీవోలు 216, 217 జారీ చేశారు. కానీ ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తున్నట్టు జారీ చేసిన జీవో 218 గురించి కేబినెట్‌లో చర్చించ లేదు. మద్యం దుకాణాలపై ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసి అస్మదీయులకు అడ్డగోలుగా ప్రయోజనం కల్పించిన చంద్రబాబు తమ సన్నిహితులైన బార్ల యజమానులకు కూడా అడ్డగోలుగా లబ్ధి చేకూర్చింది.
నిబంధనల మార్పు : అందుకోసం చంద్రబాబు ఆదేశాలతో బార్లపై ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని…అందుకోసం ఎక్సై్‌జ్ చట్టంలోని 10(ఏ) నిబంధనను తొలగించాలని అప్పటి ఎక్సైజ్ కమిషనర్ 2015, సెప్టెంబరు 1న ప్రభుత్వానికి ఓ సర్కుల్యర్ పంపారు. కానీ ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని బార్ల యజమానులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు కనికట్టు చేశారు. అందుకోసం 2015, సెప్టెంబరు 9న బార్ల యజమానులు ఓ వినతిపత్రం సమర్పించినట్టు రికార్డుల్లో చూపించడం గమనార్హం. సెప్టెంబరు 9న వినతి పత్రం సమర్పిస్తే… అంతకు ముందు అంటే సెప్టెంబరు 1నే ఎక్సైజ్ కమిషనర్ ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని ప్రభుత్వానికి సర్క్యూలర్ ఎలా పంపారనేది ప్రశ్న.
సీఐడీ విచారణ : ఏకపక్షంగా బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేయాలని నిర్ణయించారు. అప్పటి సీఎం చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆమోదం తోనే ఈ వ్యవహారాన్ని అడ్డగోలుగా నడిపారు. అందుకు సంబంధించిన నోట్ ఫైళ్లపై ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర 2015, డిసెంబర్ 3న, ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు 2015, డిసెంబర్ 4న డిజిటల్ సంతకాలు చేసారని చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్ర ఖజానాకు రూ.1,299.64 కోట్లు గండి పడిందని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తప్పుబట్టారు.
