Latest Posts

ఈ నెల 26న తిరుమలకు ప్రధాని మోదీ..!!

ప్రధాని మోదీ ఈ నెల 26న తిరుపతికి వచ్చే అవకాశం ఉందని అధికారులకు సమాచారం అందింది. ప్రధాని మోదీ ఈ నెల 24 నుంచి వరుసగా మూడు రోజులు తెలంగాణ ఎన్నికల పర్యటనలో పాల్గొననున్నారు. ఈ సమయంలోనే తిరుమల శ్రీవారి దర్శనం కోసం రానున్నట్లు తెలుస్తోంది. ప్రాధమికంగా అందిన సమాచారంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27న ప్రధాని తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారని సమాచారం.

 

ప్రధాని మోదీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం కోసం వరుసగా మూడు రోజులు పాల్గనేలా షెడ్యూల్ ఖరారైంది. నవంబర్ 25న మహేశ్వరం, కామారెడ్డి సభల్లో పాల్గొననున్నారు ప్రధాని మోడీ. నవంబర్ 26న తూప్రాన్, నిర్మల్, 27న మహబూబాబాద్, కరీంనగర్ ప్రచార సభల్లో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌లో జరిగే రోడ్‌షోకు హాజరవుతారు. ఈ నెల 28న తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో, గ్రేటర్ పరిధిలో సీట్ల పైన భారీగా ఆశలు పెట్టుకున్న బీజేపీ..27న భారీ రోడ్ షోకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే బీజేపీ – జనసేన పొత్తుతో ఎన్నికల్లోకి దిగటంతో ప్రధాని మోడీతో ప్రచార సభల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి.

 

మూడు రోజులు తెలంగాణలో పర్యటన ఖరారు కావటంతో తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రధాని వచ్చే అవకాశం ఉందని అధికారులకు ప్రాధమికంగా సమాచారం అందింది. దీనికి సంబంధించి ప్రధాని కార్యాలయం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న రాజకీయ సమీకరణాల వేళ ప్రధాని పర్యటన – ప్రచారం పైన ఆసక్తి కొనసాగుతోంది. తెలంగాణలో బీజేపీ – జనసేన మధ్య పొత్తు కొనసాగుతోంది. ఏపీలోనూ తమ రెండు పార్టీల మధ్యే పొత్తు ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నా..తెలుగుదేశంతో పవన్ పొత్తు ప్రకటించారు. సంయుక్త మేనిఫెస్టో ఖరారు చేసారు. ఈ సమయంలో బీజేపీ నిర్ణయం ఏంటనేది ఆసక్తిగా మారుతోంది.

 

అయితే, ప్రధాని ఈ సారి పర్యటనలో కేవలం తిరుమల శ్రీవారి దర్శనం మినహా.. పార్టీ పరంగా ఎలాంటి సమావేశాలు ఏపీలో ఖరారు కాలేదని తెలుస్తోంది. తెలంగాణలో మాత్రం బీజేపీ ఇప్పటికే బీసీ సీఎం నినాదం.. ఎస్సీ వర్గీకరణ అంశాలు కలిసి వస్తాయని అంచనా వేస్తోంది. తెలంగాణ ఫలితాల పైన ఏపీ రాజకీయాల పైన బీజేపీ నాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు

Editor