కోట్లాది రూపాయల విలువ చేసే స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో మరో మలుపు. ఈ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేయడాన్ని ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లనుంది. సుప్రీంకోర్టులో సవాల్ చేయనుంది.
Advertisement
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో చంద్రబాబుకు ఊరట లభించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో 53 రోజుల పాటు విచారణను ఎదుర్కొన్న చంద్రబాబు అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్‌పై రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి ఇదివరకే విడుదల అయ్యారు.
హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో కంటి ఆపరేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోన్నారు. గతంలో ఇచ్చిన బెయిల్‌కు అనుగుణంగా ఈ నెల 28వ తేదీన సరెండర్ కావాల్సి ఉంది. ఈలోగా చంద్రబాబు తరఫు న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
చంద్రబాబు ఆనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. చంద్రబాబుపై రాజకీయ కక్షసాధింపులో భాగంగానే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇరికించారని వాదించారు. వాదనలను విన్న అనంతరం హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.
దీనిపై ఏపీ ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లనుంది. ఇంకాస్సేపట్లో ఏపీ సీఐడీ అధికారులు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయనున్నారు. చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేయనున్నారు. ఈ కేసులో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు తమ పరిధిని దాటి ఉన్నాయని ఏపీ సీఐడీ అధికారులు చెబుతున్నారు
