అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికార హోదాను దుర్వినియోగం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. టీహబ్‌లో యువతతో కేటీఆర్ సమావేశం నిర్వహించారని పేర్కొంది. రాజకీయ కార్యక్రమాలు నిర్వహించకుండా ప్రభుత్వ సంస్థలకు ఆదేశాలివ్వాలని కాంగ్రెస్ పార్టీ నేతలు తమ ఫిర్యాదులో కోరారు.
Advertisement
ఈ క్రమంలో ఎన్నికల సంఘం దర్యాప్తు చేపట్టింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని టీహబ్‌లో యువతతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించడంతోపాటు ఎన్నికల ప్రచారం కోసం టీహబ్‌ను వాడుకున్నారని ఆరోపిస్తూ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. అధికార హోదాను దుర్వినియోగం చేసినందుకు కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.
అంతేగాక, రాజకీయ కార్యక్రమాలు నిర్వహించకుండా ప్రభుత్వ సంస్థలకు ఆదేశాలివ్వాలని డిమాండ్ చేశారు.ఇది ఇలావుండగా, అమరవీరుల ప్రాంగణంలో ఇటీవల కేటీఆర్, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న నిర్వహించిన ఇంటర్వ్యూపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వానికి చెందిన భవనంలో ఇంటర్వ్యూ నిర్వహించారని.. కాంగ్రెస్ నేత నిరంజన్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో సీఈఓ వికాస్ రాజ్ ఈ ఫిర్యాదును హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారికి పంపించారు.
ఈ క్రమంలో సంబంధిత రిటర్నింగ్ అధికారికి ఈ ఫిర్యాదు చేరడంతో.. వారు పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకోవాలని సైఫాబాద్ పోలీసులకు సూచించారు. ఈ విషయంలో పోలీసులు దర్యాప్తులో అనుమతి లేకుండా ఇంటర్వ్యూ చేసినట్లు గుర్తించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు అనుమతి లేకుండా ఇంటర్వ్యూ చేసినందుకు నిర్వాహకుడిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అంతేగాక, ఈ ప్రదేశంలో ఇంటర్వ్యూతోపాటు డ్రోన్ ఎగురవేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో డ్రోన్ ఎగురవేసిన నిర్వాహకుడు ఎవరనే వివరాలను పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉందని.. రాజకీయ నాయకులు ప్రభుత్వ సంస్థలను వారి కార్యకలాపాల కోసం వినియోగించుకోరాదని పోలీసులు స్పష్టం చేశారు.
