చంద్రబాబు అరెస్టు తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాల్లో ఆయన సతీమణి భువనేశ్వరి రాష్ట్రంలో చేస్తున్న పర్యటనలపై ఆగ్రహంతో వైసీపీ నేతలు ఆమెపై విమర్శలకు దిగుతున్నారు.
ఈ క్రమంలో తెలంగాణకు వెళ్లిన ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై అక్కడి టీడీపీ నేతలు దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీనిపై వైసీపీ మండిపడుతోంది. అంతే కాదు దీన్ని కాపు సామాజికవర్గంపై కమ్మకుల దాడిగా అభివర్ణిస్తోంది.
ఖమ్మంలో అంబటిపై దాడి చేసిన టీడీపీ నేతల్ని కమ్మ సామాజికవర్గంగా అభివర్ణిస్తూ ఈ దాడికి వ్యతిరేకంగా ఇవాళ విజయవాడలో వైసీపీ నిరసనలు చేపట్టింది. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాటు పలువురు వైసీపీ నాయకులు పోస్టర్లు పట్టుకుని నిరసన ప్రదర్శన చేశారు. వంగవీటి రంగా విగ్రహం వద్దకు వెళ్లి అంబటి రాంబాబు ఫొటోతో కాపు సామాజిక వర్గంపై కమ్మకుల దాడిని ఖండిస్తున్నట్లు ప్లకార్డులు ప్రదర్శించారు.
మంత్రి అంబటిపై కమ్మ జాతి చేసిన దాడిని ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి వెలంపల్లి తెలిపారు. అలాగే అంబటిపై జరిగిన దాడిని పవన్ కళ్యాణ్ ఖండించాలని డిమాండ్ చేశారు. కాపులపై పవన్ కల్యాణ్ కి ప్రేమ లేదన్నారు. కాపులపై దాడులు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదని వెలంపల్లి ప్రశ్నించారు. అంబటి రాంబాబు పై జరిగిన దాడిని పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు.
చంద్రబాబు సామాజిక వర్గం వారికి ఈ రాష్ట్రంలో దమ్ము లేక పక్క రాష్ట్రంలో తన సొంత పనిపై రాంబాబు వెళ్తే దాడి చేయడం హేయమన్నారు. కావాలనే దాడికి ప్రయత్నం చేశారన్నారు. కాపుల ద్రోహి పవన్ కళ్యాణ్ అని తెలిపారు.తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందన్నారు.అంబటి పై జరిగిన దాడిని పవన్ కళ్యాణ్ ఖండించాలి లేకపోతే కాపుల ద్రోహిగా మిగిలిపోతాడు అని అన్నారు.
