న్యూఢిల్లీ: దేశీయ రైల్వే నెట్‌వర్క్‌లో పెను మార్పులు చోటు చేసుకుంటోన్నాయి. వందే భారత్‌తో దీనికి తెర తీసింది కేంద్ర ప్రభుత్వం. ఈ సెమీ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్‌కు అనూహ్య స్పందన లభిస్తోన్న నేపథ్యంలో- రైల్వేల్లో మరిన్ని ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది కేంద్రం.
తాజాగా మరిన్ని సెమీ హైస్పీడ్ రైళ్లను పట్టాలెక్కించనుంది.
రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్‌ఆర్టీఎస్) రైళ్లను అందుబాటులోకి తీసుకుని రానుంది. రీజినల్ రైళ్లు ఇవి. దూర ప్రాంతాల మధ్య ఇవి రాకపోకలు సాగించవు. మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (ఎంఎంటీఎస్) తరహాలో రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్‌ఆర్టీఎస్) కారిడార్‌లలో మాత్రమే ఈ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.
ఇవి రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండవు. వీటిని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తొలి సెమీ హైస్పీడ్ ఆర్ఆర్టీఎస్ రైలు ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ రీజియన్ పరిధిలో అందుబాటులోకి రానుంది. 82 కిలోమీటర్ల కారిడార్ ఇది. ఈ రైలుకు ర్యాపిడ్ ఎక్స్ (RapidX) అని పేరు పెట్టారు.
నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎన్సీఆర్టీసీ) ఈ రైలు సర్వీసులను పర్యవేక్షిస్తుంది. దేశంలో ఆర్ఆర్టీఎస్ వ్యవస్థ కింద ప్రవేశపెట్టబోయే మొట్టమొదటి సెమీ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ ఇదే. ర్యాపిడ్ ఎక్స్ అనే బ్రాండ్ నేమ్ మీదే వివిధ రీజియన్ల మధ్య దశలవారీగా ఈ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.
ర్యాపిడ్ ఎక్స్ లోగోగా గ్రీన్ లీఫ్‌ను ఎంపిక చేశారు. వాహన కాలుష్యాన్ని తగ్గించడం, పర్యావరణ పరిరక్షణకు గుర్తుగా గ్రీన్ లీఫ్‌ను లోగోగా ఎంచుకున్నారు అధికారులు. డీకార్బనైజేషన్, గ్రీన్ ఎనర్జీని ఇది రెప్రజెంట్ చేస్తుంది. అందుకే గ్రీన్ లీఫ్‌ను లోగోగా ఎంపిక చేసినట్లు ఆర్ఆర్టీఎస్ కార్పొరేషన్ తెలిపింది.
ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో వాహన కాలుష్యం ఏ స్థాయిలో ఉంటోందో తెలిసిన విషయమే. సాధ్యమైనంత వరకు దీన్ని నియంత్రించడంలో భాగంగా ఆర్ఆర్టీఎస్ సెమీ హైస్పీడ్ రైల్వే వ్యవస్థ తెర మీదికి వచ్చింది. ఈ రైలు సర్వీస్ వల్ల ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ ఆర్ఆర్టీఎస్ కారిడార్‌లో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది.
ఈ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 20వ తేదీన ప్రారంభించనున్నారు. మొత్తం 82 కిలోమీటర్ల కారిడార్‌లో తొలి విడతలో 17 కిలోమీటర్ల స్ట్రెచ్ అందుబాటులోకి రానుంది. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్‌లల్లో జరిగే కార్యక్రమాల్లో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. పచ్చ జెండా ఊపి రైలును ప్రారంభిస్తారు.
