అమిత్ షా తో సీఎం జగన్ కీలక భేటీ – ఇక ముందుకే..!?

ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. తొలిరోజు కేంద్ర మంత్రులతో సమావేశమైన సీఎం జగన్ ఈ రోజు హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరగనున్న వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సదస్సులో పాల్గొననున్నారు.

ఈ రాత్రికి అమిత్ షా తో సీఎం జగన్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పాలనా వ్యవహారాలతో పాటుగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ భేటీ కీలకంగా మారుతోంది.

వరుస భేటీలు: ముఖ్యమంత్రి జగన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో సుమారు 45 నిమిషాల పాటు చర్చించారు. ఈ భేటీలో పోలవరం ప్రాజెక్టు గురించి ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలిసింది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గతంలో కేటాయించిన మొత్తాన్ని మరో రూ. 10,500 కోట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఆర్థిక శాఖ దీనిపై సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఆ వెంటనే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉన్నందున ముఖ్యమంత్రి జగన్ ఈ అంశంపై కేంద్ర మంత్రితో చర్చించారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ నివాసానికి వెళ్లి ఆయనతో గంట సేపు సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ బకాయిల రూపంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,359 కోట్లు చెల్లించాల్సి ఉందని సీఎం తెలిపారు.

అమిత్ షా తో ప్రత్యేక భేటీ: 2014 జూన్‌ నుంచి 2017 జూన్‌వరకూ సరఫరా చేసిన విద్యుత్‌ ఛార్జీలను ఇప్పటికీ చెల్లించలేదనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. భేటీ అనంతరం కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ మీడియాతో మాట్లాడారు. ఆర్డీఎస్ఎస్ పథకానికి ఆంధ్రప్రదేశ్ అర్హత సాధించిందని, ఆ పథకం కింద అందించే ఆర్థిక సహాయం గురించి చర్చించామని చెప్పారు.

ఇక, హోం మంత్రి అధ్యక్షతన జరిగే వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సదస్సు తరువాత కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం జగన్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ రాత్రి 8.30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జగన్‌ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ భేటీలో కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పెండింగ్ అంశాలతో పాటు రాజకీయపరమైన చర్చ జరిగే అవకాశం ఉంది.

ఏపీలో పరిణామాలపై చర్చ: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఆయన తొలిసారిగా ఢిల్లీ చేరుకోవడంతో ఈ భేటీ పైన ఆసక్తి నెలకొంది. చంద్రబాబు స్కిల్ స్కాం కేసులో సీఐడీ దర్యాప్తు చేపట్టక ముందే కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని జీఎస్టీ, ఈడీ సంస్థలు విచారణ జరిపి కొందరిని అరెస్టు కూడా చేశాయి.

ఈ కేసులో ఈడీ దర్యాప్తు మరింత ముందుకు సాగాల్సిన అవసరం ఉందనేది ఏపీ ప్రభుత్వంలోని ముఖ్యుల అభిప్రాయంగా తెలుస్తోంది. కేసుల విచారణ..చోటు చేసుకుంటున్న పరిణామాలను అమిత్ షా తో చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే సమయంలో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ పాలనా.. రాజకీయ పరమైన నిర్ణయాలతో సీఎం జగన్ మరింత వేగంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.

Posted Under AP
YES9 TV