ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పహారం అందించే పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే దీన్ని అక్టోబర్ 24 నుంచి అమలు చేయాలని తొలుత నిర్ణయించినా..
రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో ఆరో తేదీన ఈ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ పథకాన్ని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం రావిరాల హై స్కూల్ లో సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
ప్రభుత్వం ఇప్పటికే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు అల్పహారం కూడా పిల్లలకు పెట్టడంతో వారు ఆరోగ్యంగా ఉండి చదువుకుంటారని అధికారులు చెబుతున్నారు.విద్యార్థులకు అల్పాహారంలో కిచిడి, పొంగల్, ఉప్మా అందిస్తారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం పూట రాగిజావను అందజేస్తున్నారు. దానితో పాటుగా అల్పాహారం అందించడంతో విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారు.
తమిళనాడులో ఈ అల్పహార పథకం విజయవంతంగా అమలవుతోంది. ఇటీవలే అక్కడికి వెళ్లి వచ్చిన ఐఎఎస్ అధికారుల బృందం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. తమిళనాడులో కేవలం ప్రాథమిక పాఠశాలల వరకే అమలు చేస్తున్నారు. తెలంగాణలో అలా కాకుండా ఉన్నత పాఠశాలల విద్యార్థులకు కూడా బ్రేక్ ఫాస్ట్ ను అందచేయనున్నారు. ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ప్రతి యేటా దాదాపు రూ. 400 కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉంది. అయితే ఇది ఎన్నికల కోసం తీసుకొచ్చిన పథకమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
విద్యార్థులకు అల్పహారంలో భాగంగా సోమవారం – గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ, మంగళవారం – బియ్యం రవ్వ కిచిడి, చట్నీ, బుధవారం – బొంబాయ్ రవ్వ ఉప్మా, సాంబార్, గురువారం – రవ్వ పొంగల్, సాంబార్, శుక్రవారం – మిల్లెట్ రవ్వ కిచిడి, సాంబార్,శనివారం – గోధుమ రవ్వ కిచిడి, సాంబార్ అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అల్పహార పథకం 23,05,801 మంది విద్యార్థులకు వర్తింప జేయనున్నారు. విద్యార్థులకు అల్పహారం అందించే పథకం ఇప్పటికే ప్రవేశ పెట్టేది ఉండే అని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఇప్పటికైనా ఈ పథకాన్ని తీసుకొచ్చినందుకు పిల్లలకు మంచి జరుగుందన్నారు.
