వీడియో: పరిటాల సునీత ఆత్మహత్యాయత్నం

అనంతపురం: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు.

ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.

2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, డొల్ల కంపెనీలను సృష్టించి, ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. దీనిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మాజీ మంత్రి పరిటాల సునీత చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రెండు రోజులుగా ఆమె అనంతపురం శివార్లలోని పాపంపేటలో దీక్ష కొనసాగిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యం క్షీణిస్తోండటంతో దీక్షను భగ్నం చేశారు. అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఈ క్రమంలో పరిటాల సునీత, పోలీసుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. దీక్షను భగ్నం చేయడానికి వచ్చిన అనంతపురం రూరల్ పోలీసులపై సునీత మండిపడ్డారు. 2024 ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చేది టీడీపీనే అని, చంద్రబాబు అరెస్టుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

తమ దీక్షకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోండటం వల్లే పోలీసులు అడ్డుకుంటోన్నారని పరిటాల సునీత ఆరోపించారు. ఎంతమంది అడ్డొచ్చినా వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనంటూ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు విడుదల అయ్యేంత వరకూ దీక్ష కొనసాగిస్తానని తేల్చి చెప్పారు. అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.

పోలీసుల ముందే తన మెడలో ఉన్న నల్ల రంగు చున్నీని మెడకు ఉరితాడుగా బిగించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆమె చర్యలను పోలీసులు, దీక్షా శిబిరంలో కూర్చున్న తోటి తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు అడ్డుకున్నారు. బలవంతంగా ఆమె మెడలో నుంచి చున్నీని తీసివేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

Posted Under AP
YES9 TV