తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
చంద్రబాబు అరెస్టును టిడిపి నేతలు నిరసిస్తున్నారు. కక్షపూరితంగా అరెస్ట్ చేశారని విమర్శలు గుప్పిస్తున్నారు. టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ పలువురు ఆయన తనయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు సంఘీభావం ప్రకటిస్తున్నారు.
అలా సంఘీభావం ప్రకటిస్తున్న వారిలో జాతీయ నాయకులు కూడా ఉన్నారు. ఇక వారిపైనా వైసీపీ ఎంపీ సాయిరెడ్డి మండిపడ్డారు. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కేవలం ఇండియా కూటమి సభ్యులు చంద్రబాబు నాయుడికి మద్దతిస్తున్నారు. చంద్రబాబు కుమారుడికి ఫోన్ కాల్స్ ద్వారా మద్దతు తెలుపుతున్న వారిలో ఇండియా కూటమి నేతలే ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
దీంతో టీడీపీ I.N.D.I.Aలో భాగమేనని రుజువైందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కూటమి మరియు టీడీపీ ఒకే వ్యూహం కలిగి ఉన్నారని పేర్కొన్నారు. అధికారం కోసం కలిసి చేతులు కలపడం, అందిన కాడికి వీలైనంత రాష్ట్రాన్ని దోచుకోవడమే లక్ష్యమన్నారు. టీడీపీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము లేదని విజయసాయిరెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
అంతేకాదు చంద్రబాబు కోసం జరుగుతున్న ఆందోళనలు ఏవీ నిజం కాదని ఆయన సెటైర్లు వేశారు. చంద్రబాబు కోసం నిరసనలు వ్యక్తం చేస్తున్న వారి ఫోటోను ట్విట్టర్లో ట్వీట్ చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నైపుణ్య నేరస్తుడు శ్రీ చంద్రబాబు అరెస్టుకు బెంగళూరులో ఐటీ ఉద్యోగుల నిరసనంటూ పచ్చకుల మీడియా హోరెత్తిస్తోంది అంటూ మండిపడ్డారు.
వీరు నిజంగా ఐటీ ఉద్యోగుల్లా ఉన్నారా? టీడీపీ కిరాయి పెయిడ్ ఆర్టిస్టుల్లా కనిపిస్తున్నారే! అంటూ అనుమానం వ్యక్తం చేసిన ఆయన, చంద్రబాబు కోసం ఆందోళన వ్యక్తం చేస్తున్న వారు పెయిడ్ ఆర్టిస్టులు కానీ, నిజమైన ఐటీ ఉద్యోగులు కాదని విమర్శించారు. నిత్యం సోషల్ మీడియా వేదికగా చంద్రబాబును విజయ సాయి రెడ్డి టార్గెట్ చేస్తూనే ఉన్నారు.
