కేరళను వణికిస్తున్న నిపా వైరస్: శబరిమల యాత్రికులకు మార్గదర్శకాలు ఇవ్వాలన్న కోర్టు

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. నిపా వైరస్ కారణంగా ఇప్పటికే ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు నిపా వైరస్ బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు.

నిపా వ్యాప్తి కట్టడికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. తాజాగా, హైకోర్టు ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేసింది.

నిపా వ్యాప్తి నేపథ్యంలో పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమల యాత్రికులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వానికి కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శబరిమల యాత్ర కోసం వచ్చే భక్తులకు అవసరమైన మార్గదర్శకాలను జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంపై ఆరోగ్యశాఖ కార్యదర్శితో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ట్రావెన్ కోర్ దేవస్య బోర్డును కోర్టు కోరింది.

కాగా, ప్రతీ మలయాళ నెలలో పూజల కోసం పాతానంతిట్ట జిల్లాలోని శబరిమల ఆలయం ఐదు రోజులపాటు తెరుచుకుంటుంది. ఈ నెల ఆదివారం నుంచి యాత్రికుల కోసం దేవాలయం తెరిచి ఉంటుంది. మరోవైపు, నిపా వైరస్ కేసులతో కేరళ ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. నిపా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న కోజికోడ్ జిల్లాలో ఇప్పటికే ఆంక్షలు విధించినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

కోజికోట్ జిల్లాలో నిపా ప్రభావిత ప్రాంతాలు, పంచాయతీలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. అంతేగాక, జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు వారంరోజులపాటు సెలవు ప్రకటించారు. కేరళలో బయటపడిన నిపా వైరస్.. బంగ్లాదేశ్ వేరియంట్ అని.. దీని వ్యాప్తి తక్కువే అయినప్పటికీ.. మరణాల రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ తెలిపారు. అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉండేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా, ఇప్పటి వరకు నమోదైన కేసులన్నీ అటవీ ప్రాంతానికి 5 కిలో మీటర్ల దూరంలోనే ఉన్నాయి.

కేరళ నిపా:

297 మంది హై-రిస్క్ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నారు. కేరళలో శుక్రవారం మరో 130 మంది కాంటాక్ట్‌లను గుర్తించడంతో నిపా పాజిటివ్ కేసుల కాంటాక్ట్ లిస్ట్‌లో వ్యక్తుల సంఖ్య 1,080కి పెరిగింది. హై-రిస్క్ కాంటాక్ట్ లిస్ట్‌లో 297 మంది వ్యక్తులు ఉన్నారు, వీరిలో 122 మంది ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారు.

Editor