తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల గడువు

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గరపడుతోంది. అక్టోబర్‌లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. డిసెంబర్ నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావొచ్చు.

ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి అన్ని పార్టీలు కసరత్తు సాగిస్తోన్నాయి. అధికార భారత్ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ.. సర్వశక్తులను ఒడ్డుతున్నాయి.

ఎన్నికల సమీపిస్తోన్న నేపథ్యంలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రజల్లోకి చొచ్చుకెళ్లడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించుకుంది. ప్రజా సమస్యలపై పోరాటాన్ని మొదలుపెట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం నిరసన ప్రదర్శనలనూ చేపట్టింది.

ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి 24 గంటల నిరాహార దీక్షను చేపట్టారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద దీక్షకు దిగారు. నిరుద్యోగ నిరాహార దీక్ష ఇది. ఉద్యోగాలను భర్తీ చేసే విషయంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందంటూ ఆయన ఈ దీక్షను చేపట్టారు.

దీనికి పోలీసుల అనుమతి పాక్షికమే. 24 గంటల పాటు దీక్షను కొనసాగించడానికి హైదరాబాద్ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. సాయంత్రం 6 గంటల వరకే పర్మిషన్ ఇచ్చారు. అయినప్పటికీ- కిషన్ రెడ్డి దీక్షను కొనసాగిస్తోండటంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. నిరాహార దీక్షను భగ్నం చేశారు.

దీక్షను భగ్నం చేసే అవకాశం ఉందనే ఉద్దేశంతో అప్పటికే బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధర్నా చౌక్ వద్దకు చేరుకున్నారు. కిషన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులను వారు అడ్డుకున్నారు. దీనితో తోపులాట చోటు చేసుకుంది. ధర్నా చౌక్, ఇందిరాపార్క్, లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Editor