ఏపీలో ఎన్నికల రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కీలక నిర్ణయాల దిశగా అడుగులు పడుతున్నాయి. అటు కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు సిద్దం అవుతోంది.
ఈ సమావేశాల్లో కీలక బిల్లులను తీసుకురానుంది. కేంద్రం మూడ్ పైన స్పష్టత రావటంతొ ఏపీ సీఎం జగన్ ఇటు ఎన్నికల కార్యాచరణ వేగవంతం చేసారు. ఈ నెల 20న మంత్రివర్గ సమావేశానికి నిర్ణయించారు. కీలక నిర్ణయాల దిశగా కసరత్తు ముమ్మరం అయింది.
మారుతున్న రాజకీయం : ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కేంద్రంలో మారుతున్న లెక్కలతో సీఎం జగన్ అలర్ట్ అయ్యారు. ఈ నెల 20న మంత్రివర్గ సమావేశానికి నిర్ణయించారు. ఈ నెల 21వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు వచ్చే వారం ప్రారంభం కానున్నాయి.
జమిలి ఎన్నికలు..ముందస్తు ఎన్నికల ప్రచారం వేళ పార్లమెంట్ సమావేశాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది. కేంద్రం లోక్ సభ ఎన్నికలు ఎప్పుడు జరపాలని నిర్ణయించినా..వాటితో పాటుగానే ఏపీ ఎన్నికలు జరగున్నాయి. వచ్చే జనవరి ద్వితీయార్ధంలో లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే ప్రచారం ఢిల్లీ సర్కిల్స్ లో జరుగుతోంది.
కేంద్రం అడుగులు గమనిస్తూ : ఏపీలో మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. అయితే, లోక్ సభ ఎన్నికల నిర్వహణలో నిర్ణయం మారితే దానికి అనుగుణంగా ఏపీలోనూ ఎన్నికల నిర్వహణ మారే అవాకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.
కేంద్రంలోని ముఖ్యులతో చర్చల తరువాత రాష్ట్రంలో వాటికి అనుగుణంగా తీసుకోవాల్సిన నిర్ణయాల పైన కసరత్తు చేయనున్నారు. అందులో భాగంగా ఈ నెల 20న మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం ఖరారు చేసారు. వచ్చే బుధవారం మధ్నాహ్నం 3 గంటలకు మంత్రివర్గ సమావేశం నిర్వహణకు వీలుగా అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ భేటీలో కీలక నిర్ణయాల దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది.
కీలక నిర్ణయాల దిశగా : ఎన్నికలకు సిద్దం అవుతున్న క్రమంలో ఈ కేబినెట్ లో నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో అమోదించే బిల్లులను కేబినెట్ ఆమోదించనుంది. అదే సమయంలో కేంద్రం జమిలి లేదా ముందస్తు ఎన్నికలకు సిద్దం అయితే ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని పైన ఈ సమావేశంలో సీఎం జగన్ తన అభిప్రాయం స్పష్టం చేసే ఛాన్స్ కనిపిస్తోంది.
ఇక, పాలనా పరమైన నిర్ణయాలు.. మేనిఫెస్టోలో పెండింగ్ అంశాలు.. ఉద్యోగులకు ఐఆర్..జీపీఎస్..కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ బిల్లుల వంటి వాటి పైన చర్చకు అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక..చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో సీఎం జగన్ మంత్రులకు దిశా నిర్దేశం చేయనున్నారు. దీంతో, ఈ కేబినెట్ భేటీ నిర్ణయాలపైన ఆసక్తి కొనసాగుతోంది.
