ప్రస్తుతం రాజమండ్రి జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు(Chandrababu Naidu) మరో షాక్ తగిలింది. తనను హౌస్ రిమాండ్‌కు అనుమతించాలని ఆయన తరపున దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన ఏసీబీ(ACB) కోర్టు..
వాటిని తిరస్కరించింది. కొద్దిసేపటి క్రితం ఈ మేరకు తీర్పు వెలువరించింది. నిన్న ఈ అంశంపై ఇటు చంద్రబాబు తరపున న్యాయవాదులు, అటు సీఐడీ తరపున న్యాయవాదులు న్యాయమూర్తి ముందు సుదీర్ఘమైన వాదనలు వినిపించారు. చంద్రబాబుకు ప్రాణహాని ఉందని ఆయన తరపున వాదిస్తున్న సిద్ధార్థ్ లుథ్రా కోర్టుకు విజ్ఞప్తి చేశారు. గౌతమ్ నవ్‌లఖా కేసులో సుప్రీంకోర్టు మే 12, 2021న ఇచ్చిన కేసును ఉదాహరణగా ప్రస్తావించారు. సెక్షన్ 167 కింద తగిన కేసుల్లో హౌస్ అరెస్టుకు ఆదేశించే అధికారం కోర్టులకు ఉంటుందని గౌతమ్ నవ్‌లఖా కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని పేర్కొన్నారు. వయస్సు, ఆరోగ్య పరిస్థితులు, నిందితుడి పూర్వ చరిత్ర, నేర స్వభావం ఆధారంగా న్యాయస్థానాలు నిర్ణయం తీసుకోవచ్చని గౌతమ్ నవ్‌లాఖా కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని వ్యాఖ్యానించారు.
అయితే హౌస్ అరెస్ట్ అవసరం లేదని.. రాజమండ్రి సెంట్రల్ జైలులో కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని సీఐడీ(CID) తరపున వాదనలు వినిపించిన లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. నిన్న వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు.. ఈ రోజు ఏ రకమైన ఆదేశాలు ఇస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అయితే చంద్రబాబు హౌస్ రిమాండ్‌కు అనుమతి నిరాకరిస్తూ ఏసీబీ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.
మరోవైపు ఏసీబీ కోర్టు రిమాండ్‌ను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో ఆయన తరపు లాయర్లు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు తరపున మాజీ అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ పిటిషన్ వేశారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని పిటిషన్ లో పేర్కొన్నారు. గవర్నర్ అనుమతి లేకుండానే ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌పై రేపు విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.
ఇక ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు రాబట్టేందుకు తమ కస్టడీకి ఐదు రోజులు ఇవ్వాలని కోరింది. అయితే ఈ పిటిషన్‌పై చంద్రబాబు తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. తాము రేపు కౌంటర్ దాఖలు చేస్తామని న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో ఏసీబీ న్యాయస్థానం… పోలీస్ కస్టడీ పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది.
వచ్చేవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. సీఎం జగన్ఢిల్లీ పర్యటన తర్వాత కేబినెట్ భేటీ
