ప్రధాని కీలక మంత్రాంగం, జమిలి వైపే – పొలిటికల్ అలర్ట్..!!

జమిలి ఎన్నికల దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రధాని మోదీ కీలక మంత్రాంగం చేస్తున్నారు. ఈ నెల 17 నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు రాజకీయంగా కీలక నిర్ణయాలకు వేదికగా కానుంది.

ప్రధాన బిల్లులకు ఆమోదం తెలపనునున్నట్లు ప్రచారం సాగుతోంది. తెలంగాణతో సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ జమిలి ప్రతిపాదనతో ఎన్నికలు నిర్వహణపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఢిల్లీలో ఏం జరుగుతోందనే ఉత్కంఠ కొనసాగుతోంది.

ప్రధాని- షా బిగ్ ప్లాన్: ఢిల్లీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మిషన్ -2024 లక్ష్యంగా ప్రధాని మోదీ మాస్టర్ ప్లాన్ తో ముందుకు వస్తున్నారు. అనూహ్యంగా ఈ నెల 17వ తేదీ నుంచి నిర్వహించాలని నిర్ణయించిన పార్లమెంట్ సమావేశాలు రాజకీయంగా కలకలానికి కారణమవుతున్నాయి. కీలక నిర్ణయాలు ఉంటాయని ఇప్పటికే కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సంకేతాలు ఇచ్చారు.

అదే సమయంలో జమిలి ఎన్నికల నిర్వహణ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. పార్లమెంట్ సమావేశాల నిర్ణయం తీసుకున్న గంటల్లోనే జమిలి పైన సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కోసం మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ తో 16 మంది సభ్యుల కమిటీ నియమించారు. ఈ సమయంలో శుక్రవారం రాత్రి అమిత్ షా, నడ్డాతో సహా కేంద్రంలోని కీలక అధికారులతో ప్రధాని మోదీ సుదీర్ఘ చర్చలు నిర్వహించారు.

మంత్రులు- అధికారులతో మంత్రాంగం: పార్లమెంట్ స్పెషల్ సెషన్‌లో తీసుకురానున్న బిల్లుల గురించి చర్చ చేసినట్లు తెలుస్తోంది. జమిలి ఎన్నికలతో పాటుగా యూసీసీ, మహిళా బిల్లు తో పాటుగా మొత్తం 10 బిల్లులను కేంద్రం పార్లమెంట్ లో ఆమోదం కోసం ప్రతిపాదించనుందని సమాచారం. ఈ బిల్లుల పైనే ప్రధాని మోదీ మంత్రాంగం చేస్తున్నట్లు చెబుతున్నారు.

కేంద్రంలోకి కీలక శాఖల అధికారులు ఢిల్లీలోనే అందుబాటులో ఉండాలని ప్రధాని కార్యాలయం నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి. ఇక, ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల ముగింపు సమయంలోనే ఎంపీల గ్రూపు ఫొటోలకు నిర్ణయించారు. లోక్ సభ ముందస్తు ఎన్నికల సంకేతాలు కేంద్రం నుంచి స్పష్టంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

జమిలిపై రాజకీయ ఉత్కంఠ: అయిదు రాష్ట్రాల ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే డిసెంబర్ లో జరుగుతాయా..లోక్ సభ ఎన్నికలతో పాటుగా జరిగేలా నిర్ణయాలు ఉంటాయా అనేది ఉత్కంఠ పెంచుతోంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటుగానే ఈ ఏడాది జరగాల్సిన అయిదు రాష్ట్రాల ఎన్నికలు..అదే విధంగా లోక్ సభతో పాటుగా జరగాల్సిన ఏపీ, ఒడిశా, సిక్కిం ఎన్నికలు ఉంటాయని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

దీంతో పాటుగా 2024 ద్వితీయార్ధంలో జరగాల్సిన మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా ఎన్నికలను సైతం లోక్ సభతో పాటుగా నిర్వహించే ఆలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో, అసలు జమిలి సాధ్యమా, కేంద్రం వ్యూహం ఏంటి.. పార్లమెంట్ లో ఏం చేయబోతున్నారు..అయిదు రాష్ట్రాల ఎన్నికల విషయంలో ఏం జరుగుతందనే చర్చ ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠను పెంచుతోంది.

Editor