తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఒకరిని మించి ఒకరు వ్యూహాలతో రెడీ అవుతున్న పరిస్థితి ఉంది. మూడోసారి అధికారం కోసం సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే బీఆర్ఎస్ పార్టీలో ఇటీవల అధినేత టికెట్లు ప్రకటించటంతో అసంతృప్తితో ఉన్నవారు కాంగ్రెస్ బాట పట్టనున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లా రాజకీయాలు వచ్చే ఎన్నికల్లో రసవత్తర పోరును సూచిస్తున్నాయి.
ఖమ్మం జిల్లాలో గత రెండు దఫాలుగా జరిగిన ఎన్నికల్లో చూసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా బి ఆర్ ఎస్ వేవ్ కొనసాగినప్పటికీ ఖమ్మం లో మాత్రం బి ఆర్ ఎస్ పార్టీ సత్తా చాట లేకపోయింది. ఖమ్మంలో కాంగ్రెస్ పట్టు సాధించింది. ఇక ఈసారి ఖమ్మంలో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్ కు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరోపక్క తుమ్మల నాగేశ్వరరావు ఊహించని షాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు.
ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ బాట పట్టగా, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయ్యారు. దీంతో ఖమ్మం జిల్లాలో పొలిటికల్ సీన్ మారిపోయింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మూడు జనరల్ సీట్లలో ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్ధమని కాంగ్రెస్ అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు.
పార్టీ ఆలోచన మేరకు పాలేరు లో కందాల ఉపేందర్ రెడ్డి పై పోటీకి సిద్ధమైనట్టు మొదట భావించినప్పటికీ తుమ్మల నాగేశ్వరరావు ఎంట్రీతో ఆ సీన్ మారిపోయింది. పాలేరు సీట్ నుండి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తే, ఖమ్మం ఎన్నికల బరి నుండి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఏది ఏమైనప్పటికీ ఈసారి ఖమ్మం జిల్లాలో పోరు రసవత్తరంగా ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.ఈసారి ఖమ్మం జిల్లాలో కారు దూకుడుకు చెక్ పెట్టటానికి పొంగులేటి, తుమ్మల రెడీ అవుతున్న వేళ గులాబీ అధినేత కేసీఆర్ ఏం చేస్తారు అన్నది అందరికీ ఆసక్తిగా మారింది.
