బెంగళూరు/శివమొగ్గ: ఓ పట్టణంలో ఇటీవల జరిగిన మహాత్మాగాంధీ విగ్రహం ధ్వంసం కేసులో నిందితులను అరెస్టు చేయడంలో పోలీసులు శక్తి వంచన లేకుండా పని చేశారని కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జీకే.
మిథున్ కుమార్ తెలిపారు. శివమొగ్గలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మిథున్ కుమార్ వివరాలు వెళ్లడించారు.
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా పండరహళ్లి గ్రామానికి చెందిన వినయ్‌కుమార్, గణేష్ అనే నిందితులను అరెస్టు చేశామని ఎస్పీ మిథున్ కుమార్ తెలిపారు. నిందితులు గాంధీ విగ్రహం ద్వంసం చెయ్యడానికి, తరువాత పారిపోవడానికి ఉపయోగించిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. గాంధీ విగ్రహం ద్వంసం చేసింది తామే అని నిందితులు అంగీకరించారని జిల్లా ఎస్పీ మిథున్ కుమార్ మీడియాకు చెప్పారు.
సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు. వాహనాన్ని కూడా సీజ్ చేశారు. నిందితులు ఏ సంస్థతో సహకరిస్తున్నారు అనే సమాచారం విచారణ తర్వాత తెలుస్తుందని పోలీసులు అంటున్నారు. చిత్రదుర్గ పండరహళ్లి వాసులు. స్థానిక రైతుల సహకారం. గ్రౌండ్ ఇంటెలిజెన్స్ తో పాటు, టెక్నాలజీని ఉపయోగించి నేరస్తులను గుర్తించామని జిల్లా ఎస్పీ చెప్పారు.
గాంధీ విగ్రహం ద్వంసం కావడంతో గత మూడు రోజులుగా పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రజలకు హామీ ఇచ్చారు.
దాదాపు 50 మంది సిబ్బంది, ఐదుగురు సబ్ ఇన్‌స్పెక్టర్లు, మూడు మంది ఇన్‌స్పెక్టర్లు, డీవైఎస్‌పీ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు పగలు, రాత్రి అని తేడా లేకుండా పనిచేసి కేసును ఛేదించడంలో విజయం సాధించారని జిల్లా ఎస్పీ మిథున్ కుమార్ తెలిపారు. అయితే నిందితులు గాంధీ విగ్రహాన్ని ఎందుకు ద్వంసం చేశారు అని ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు.
