నమక్కల్‌ జిల్లాలోని మట్టిని ఇస్రో శాస్త్రవేత్తలు ఉపయోగించారు. 2012 నుంచీ ఇక్కడి మట్టితో ప్రయోగాలు

చెన్నై: భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. జాబిల్లిపై తన అసలు పనికి ఇప్పుడే శ్రీకారం చుట్టింది. విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ నుంచి ఇదివరకే బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టిన ప్రజ్ఞాన్ రోవర్..

తన పని తాను చేసుకోవడాన్ని మొదలుపెట్టింది.

దీనికి సంబంధించిన కీలక అప్‌డేట్‌ను వెల్లడించింది ఇస్రో. ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలపై తన నడకను ఆరంభించినట్లు తెలిపింది. మూన్ వాక్ మొదలు పెట్టిన రోవర్‌తో బెంగళూరులోని మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్‌తో అనుసంధానం ఏర్పడిందని వివరించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా ఇస్రో విడుదల చేసింది.

ఈ మూన్ మిషన్‌లో తమిళనాడుకు చెందిన పలువురు శాస్త్రవేత్తలు పని చేసిన విషయం తెలిసిందే. చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ డైరెక్టర్ పీ వీరముత్తువేళ్ స్వరాష్ట్రం తమిళనాడే. చంద్రయాన్ 1 ప్రాజెక్ట్‌లో పని చేసిన మయిల్ స్వామి అన్నాదురై అక్కడి వారే. మిస్సైల్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సొంత రాష్ట్రం తమిళనాడేననేది తెలిసిన విషయమే.

తమిళనాడు కంట్రిబ్యూషన్ అక్కడితోనే ఆగలేదు. చివరికి ఆ రాష్ట్ర మట్టి కూడా ఈ మిషన్‌లో కీలక పాత్రను పోషించింది. టెస్టింగ్ సమయంలో ప్రజ్ఞాన్ రోవర్ పనితీరును పరిశీలించడానికి నమక్కల్‌ జిల్లాలోని మట్టిని ఇస్రో శాస్త్రవేత్తలు ఉపయోగించారు. 2012 నుంచీ ఇక్కడి మట్టితో ప్రయోగాలు సాగుతూనే ఉన్నాయి.

దీనికి కారణం లేకపోలేదు. అచ్చంగా చంద్రుడి ఉపరితలాన్ని పోలిన విధంగా ఉంటుంది నమక్కల్ జిల్లాలోని ఓ ప్రాంతం. సిత్తంపూండి, కున్నమలై.. గ్రామాల పరిసరాల్లోని మట్టి- చంద్రుడి ఉపరితలాన్ని పోలి ఉండటం వల్ల దీన్ని వినియోగించారు ఇస్రో శాస్త్రవేత్తలు. మహేంద్రగిరిలోని టెస్టింగ్ సెంటర్‌లో ఈ మట్టిపైనే రోవర్‌ పనితీరును పరిశీలించారు.

భూఉపరితలం చంద్రుడిని పోలి ఉండదనే విషయం తెలిసిందే. అందుకే- దాన్ని సాధారణ నేల మీద కాకుండా చంద్రుడి ఉపరితలాన్ని పోలి ఉండేలా తీర్చిదిద్దారు. దీనికోసం సిత్తంపూడి, కున్నమలై గ్రామాల నుంచి తీసుకొచ్చిన మట్టిని ఉపయోగించారు. 2012లో తొలిసారి ఈ ప్రాంతం నుంచి 50 టన్నుల మట్టిని ఇస్రో సేకరించింది.

దానికి పలు పరీక్షలు నిర్వహించగా.. చంద్రుడి ఉపరితలంపై ఉండే మట్టిని పోలి ఉన్నట్లు నిర్ధారించింది. పెరియార్‌ యూనివర్సిటీలోని జియాలజీ విభాగ ప్రొఫెసర్‌ ఎస్‌ అన్బళగన్‌ దీన్ని ధృవీకరించారు. ఆ తరువాతే ఈ మట్టిపై రోవర్‌ను నడిపించారు. 2019లో చంద్రయాన్‌ 2 ప్రయోగ సమయంలోనూ నమక్కల్‌ మట్టినే వినియోగించారు.

YES9 TV