ఏపీలో వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తూ సంక్షేమ పథకాల నిధులు విడుదల

ఏపీలో వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తూ సంక్షేమ పథకాల నిధులు విడుదల చేస్తున్న సీఎం వైఎస్ జగన్ ఈ సందర్భంగా మానవత్వాన్నికూడా చాటుకుంటున్నారు. తన పర్యటనల్లో కలిసి సాయం కోరుతున్న అన్నార్తులకు సాయం అందిస్తున్నారు.

ముఖ్యంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నపలువురి నుంచి అందుతున్న విజ్ఞప్తులకు వెంటనే స్పందిస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా ఇవాళ విజయనగరం జిల్లాలో గిరిజన వర్శిటీ శంఖుస్ధాపనకు హాజరైన జగన్ ఇలాంటి సాయమే చేశారు.

విజయనగరం జిల్లా మెంటాడ మండల పర్యటన సందర్భంగా మానవతా హృదయంతో మరో మహిళకు సీఎం వైఎస్ జగన్ ఆర్ధిక సహాయం అందించారు. విజయనగరం జిల్లా గరివిడి మండలం బిల్లలవలస పంచాయతీ కొండదాడి గ్రామానికి చెందిన కన్నూరు సరస్వతి(34)ది ఒక విషాదగాథ. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ క్యాన్సర్ వ్యాధితోనే మృతి చెందారు. ఆమెకు తన అనుకునే తోబుట్టువులూ ఎవరూ లేరు.

పైగా గత ఐదేళ్లుగా గొంతు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతోంది. ఆమెకు ఎలాంటి జీవనాధారం లేకపోవడంతోపాటు క్యాన్సర్ వ్యాధితో ఆమె పరిస్థితి అగమ్యగోచరంగా తయారై రోజు గడవడమే కష్టంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫించను పొందేందుకు నిబంధనల ప్రకారం అవకాశం లేకపోవడంతో తనకు ప్రభుత్వ పరంగా ఏదైనా సహాయం అందించి తనను ఆదుకోవాలని మెంటాడ మండలం చినమేడపల్లిలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం శంకుస్థాపనం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్ ను కోరింది.

ఆమె పరిస్థితిని విని చలించిన ముఖ్యమంత్రి తక్షణమే రూ.3 లక్షల ఆర్ధిక సహాయం ప్రకటించారు. ఆమెకు వెంటనే సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిని ఆదేశించారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రూ.3 లక్షల మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరుచేస్తూ రెవిన్యూ అధికారులు చెక్కును సిద్ధంచేసి రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా ఆమెకు సహాయం అందజేశారు. ముఖ్యమంత్రి సహాయంతో తనకు ప్రాణప్రతిష్ట చేశారని కన్నూరు సరస్వతి కృతజ్ఞతలు తెలిపింది.

Posted Under AP
YES9 TV