లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. ఓ ఉపాధ్యాయురాలు అమానవీయంగా ప్రవర్తించారు. విద్యార్థులకు మంచి చెడును నేర్పించాల్సిన టీచర్..
వారి మధ్య మతం ప్రస్తావనను తీసుకొచ్చారు. ఒక మతం మీద విధ్వేషాన్ని ప్రదర్శించేలా వ్యవహరించారు. ఈ ఘటనతో ఆమెపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఊపందుకుంది.
ఉత్తర ప్రదేశ్ ముజఫ్ఫర్‌నగర్ జిల్లాలోని మన్సూర్‌పూర్, ఖుబ్బాపూర్‌లోని నేహా పబ్లిక్ స్కూల్‌లో జరిగినట్లుగా తెలుస్తోంది. ఓ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు.. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన విద్యార్థికి తోటి హిందూ విద్యార్థులతో చెంపదెబ్బలను కొట్టించారు.
ఆమె పేరు తృిప్తా త్యాగి. సాధారణంగా- తరగతిలో విద్యార్థులు క్రమ శిక్షణ తప్పినా, లేక సరిగ్గా చదవకపోయినా దండించడమో, లేక తల్లిదండ్రులను పిలిపించి హెచ్చరించడమో చేస్తుంటారు టీచర్లు. తృిప్తా త్యాగి మాత్రం దీనికి భిన్నంగా ప్రవర్తించారు. తన తరగతిలో చదువుకునే ముస్లిం విద్యార్థిని అందరి ముందూ క్లాస్ రూమ్‌లో నిలబెట్టి, తోటి హిందూ స్టూడెంట్స్‌తో వరుసగా చెంపదెబ్బలు వేయించారు.
అక్కడితో ఆగలేదు. క్లాస్‌లో ఎంతమంది మహమ్మదీయుల పిల్లలు ఉన్నారో.. అంటూ ఏదో చెప్పడం వినిపించింది. నికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక స్టూడెంట్ మెల్లగా కొట్టగా.. టీచర్ కోపాన్ని ప్రదర్శించడం ఈ వీడియోలో రికార్డయింది. గట్టిగా కొట్టు.. నెక్స్ట్ ఎవరు? అంటూ చెప్పడం ఈ వీడియోలో చూడొచ్చు.
ఇలా ఒక సామాజిక వర్గానికి చెందిన విద్యార్థిపై మరో సామాజిక వర్గం విద్యార్థులతో కొట్టించడం పట్ల నెటిజన్లు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. తృిప్తా త్యాగి పట్ల తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. పాఠశాల దశ నుంచే విద్యార్థుల మధ్య మతం అనే విషాన్ని నాటుతున్నారంటూ మండిపడుతున్నారు.
