ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రధాని మోడీ ప్రశంసలు

బెంగళూరు: చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంలో పాల్గొన్న బారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) శాస్త్రవేత్తలపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు.

శనివారం తెల్లవారుజామున ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ప్రజలు, బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ..జై విజ్ఞాన్.. జై అనుసంధాన్ అనే నినదాన్ని ఇచ్చారు. చంద్రయాన్-3 ప్రయోగం ద్వారా చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా ల్యాండ్ అవడం గర్వంగా ఉందని చెప్పారు.

నేను దేశం నుంచి దూరంగా ఉన్నప్పటికీ.. నా ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయాను. చంద్రయాన్-3 విజయవంతం తర్వాత ఎప్పుడెప్పుడు భారత్ వస్తానా.. ఇస్రో శాస్త్రవేత్తలను కలుస్తాను.. అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూశాను అని ప్రధాని మోడీ చెప్పారు. ఇస్రో శాస్త్రవేత్తలు ప్రతీ భారతీయుడిని గర్వపడేలా చేశారని ప్రశంసించారు. అనంతరం ఇస్రో శాస్త్రవేత్లను కలిసేందుకు అక్కడ్నుంచి బయల్దేరారు.

కాగా, చంద్రునిపై విజయవంతమైన చంద్రయాన్-3 మిషన్‌లో పాల్గొన్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) శాస్త్రవేత్తలను అభినందించడంతోపాటు వారితో సంభాషించడానికి ప్రధాని నరేంద్ర మోడీ శనివారం తెల్లవారుజామున కర్ణాటకలోని బెంగళూరులో అడుగుపెట్టారు.

శనివారం ఉదయం 7.15 గంటలకు ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ (ISTRAC)ను మోడీ సందర్శిస్తారని అధికారిక ప్రకటన తెలిపింది. “ప్రధాని మోడీ దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన వెంటనే బెంగళూరు చేరుకుంటారు” అని పేర్కొంది.

చంద్రయాన్-3 మిషన్‌లో కనుగొన్న విషయాలు, పురోగతి గురించి నరేంద్ర మోడీకి ఇస్రో శాస్త్రవేత్తలు వివరించనున్నారు. బెంగళూరులో దిగిన తర్వాత, మోడీ ట్విట్టర్ వేదికగా.. “చంద్రయాన్-3 విజయంతో భారతదేశం గర్వపడేలా చేసిన మా అసాధారణమైన ఇస్రో శాస్త్రవేత్తలతో సంభాషించడానికి ఎదురుచూస్తున్నాము. అంతరిక్ష రంగంలో మన దేశం సాధించిన విజయాల వెనుక వారి అంకితభావం, అభిరుచి నిజంగా చోదక శక్తులు అని పేర్కొన్నారు.

YES9 TV