హైదరాబాద్: ప్రజా కవి గద్దర్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కన్నుమూసిన ప్రజా గాయకుడు గద్దర్ పాటలు బడుగుల జీవితం, సమస్యలను ప్రతిబింబిస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
ఈ మేరకు గద్దర్ సతీమణి గుమ్మడి విమలకు ఆయన లేఖ రాశారు.
‘తీవ్ర దు:ఖంలో ఉన్న ఈ సమయంలో కుటుంబసభ్యులకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. గద్దర్ పాటలు, ఇతివృత్తాలు సమాజంలోని బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబిస్తాయి. గద్దర్ రచనలు ప్రజలకు ప్రోత్సాహాన్ని అందించాయి’ అని ప్రధాని మోడీ లేఖలో పేర్కొన్నారు.
అంతేగాక, ‘తెలంగాణ సాంప్రదాయక కళారూపాన్ని పునరుజ్జీవింపజేయడంలో ఆయన చేసిన కృషి ప్రజలకు ఎప్పటికీ గర్తుండిపోతుంది. మీ దు:ఖాన్ని మాటల్లో వ్యక్తపరచలేము. కుటుంబసభ్యులకు, శ్రేయోభిలాషులకు ఈ దు:ఖాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి’ అంటూ ప్రధాని మోడీ ఆ లేఖలో పేర్కొన్నారు. గద్దర్ అనారోగ్యంతో మృతి చెందారనే విషయాన్ని బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి తాజాగా మోడీ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ లేఖ రాశారు.
కాగా, ప్రజాగాయకుడు, ప్రజా యుద్ధనౌక పేరొందిన గద్దర్(74) ఆగస్టు 6న కన్నుమూశారు. తన మాటనే పాటగా మలిచిన గొప్ప కళాకారుడిగా పేరు పొందారు గద్దర్. తెలంగాణ ఉద్యమంలో తన పాట ద్వారా ఎంతోమంది ఉద్యమనికి ఊపిరి పోశారు గద్దర్ (Gaddar). తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఆయన పాటలతో ఎంతోమందికి స్ఫూర్తి నింపారు. ఈ మధ్యనే గుండె ఆపరేషన్ చేయించుకున్నారు గద్దర్. ఈ క్రమంలో అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ప్రజా యుద్ధనౌకగా పేరొందిన గద్దర్.. పీపుల్స్ వార్, అనంతరం మావోయిస్టు, తెలంగాణ ఉద్యమాల్లో తన గళంతో కోట్లాది మంది ప్రజలను ఉత్తేజపరిచారు. అలాంటి గద్దర్ ఆకస్మిక మరణంతో తెలంగాణ ఉద్యమ నేతలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని తలచుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గద్దర్.. శేషయ్య, లచ్చమ్మ దంపతులకు 1949లో తూప్రాన్‌లో జన్మించారు. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావ్. నిజామాబాద్, హైదరాబాద్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన 1975లో కెనరా బ్యాంకులో ఉద్యోగం చేశారు. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయనకు భార్య విమల. ముగ్గురు పిల్లలు(సూర్యుడు, చంద్రుడు, వెన్నెల). జన నాట్యమండలి వ్యవస్థాపకుల్లో గద్దర్ కూడా ఒకరు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.
తన పాటలతో ఉద్యమాలకు మరింత ఊపుతెచ్చారు. 1987లో కారంచేడు దళిత హత్యలపై గద్దర్ అవిశ్రాంతంగా పోరాటం చేశారు. నకిలీ ఎన్‌కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే 1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది. బుల్లెట్లు తన శరీరంలోకి దూసుకెళ్లాయని పలుమార్లు చెప్పారాయ. కాగా, అమ్మా తెలంగాణమా, పొడుస్తున్న పొద్దుమీద పాటలతో ఉద్యమాలకు ఊపుతెచ్చారు గద్దర్. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ అనే పాటకు నంది అవార్డు వరించింది. అయితే, ఆ అవార్డును గద్దర్ తిరస్కరించారు.
