గూగుల్ గుత్తాధిపత్యానికి ఇండియా బ్రేక్.. సొంత బ్రౌజర్‌ తేనున్న మోదీ సర్కార్

ఇంటర్నెట్‌ లో ఏదైనా సెర్చ్ చేయడానికి ఎక్కువ మంది వినియోగించే బ్రౌజర్ గూగుల్ కు చెందిన క్రోమ్. మొజిల్లా ఫైర్‌ ఫాక్స్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఒపెరా వంటి బ్రౌజర్లు పోటీపడుతున్నా..

గూగుల్ మాత్రం తన స్థానం కాపాడుకుంటూ వస్తోంది. ఇప్పుడు దానికి కాస్తా భారత ప్రభుత్వం చెక్ పెట్టడానికి సిద్ధమైంది.

గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ వంటి ప్రముఖ బ్రౌజర్స్ తో పోటీపడే విధంగా ‘ఆత్మనిర్భర్’ పేరిట వెబ్ బ్రౌజర్‌ ను భారత ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. మార్కెట్లోని ఇతర వాటికి ధీటుగా, దేశీయంగా రూపొందించిన వెబ్ బ్రౌజర్‌లకు మద్దతు ఇచ్చే కార్యక్రమాన్ని మోదీ సర్కారు ప్రారంభించింది.

‘ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగుతోంది. ఈ పరిస్థితుల్లోల మన డిజిటల్ విధానంపై మనకు నియంత్రణ ఉండటం ముఖ్యం. సెక్యూరిటీ ఇబ్బందులు తలెత్తే సందర్భాల్లో విదేశీ బ్రౌజర్‌లపై ఆధారపడటం మాకు ఇష్టం లేదు. అందులోనూ స్వయం సమృద్ధిగా ఉండాలని భావిస్తున్నాం’ అని ఓ అధికారి తెలిపారు. ఈ బ్రౌజర్ భారతీయ భాషలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు.

వెబ్ బ్రౌజర్ డెవలప్‌మెంట్ ఛాలెంజ్ కోసం 3 కోట్ల కంటే ఎక్కువ గ్రాంట్‌ ను ప్రభుత్వం అందించింది. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తోంది. Google మరియు మొజిల్లా ఫైర్‌ఫాక్స్ వంటి ప్రధాన US బ్రౌజర్ కంపెనీల ‘ట్రస్ట్ స్టోర్‌లలో’ మన వెబ్ సెక్యూరిటీ సర్టిఫికేషన్ అథారిటీని చేర్చేందుకు అవకాశం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

దాదాపు 850 మిలియన్ల వినియోగదారులతో ఇంటర్నెట్ మార్కెట్‌లో భారత్ దూసుకుపోతోంది. ఈ విభాగంలో గూగుల్ క్రోమ్ 88.47 శాతం మార్కెట్ వాటాతో మార్కెట్ లీడర్‌ గా కొనసాగుతుండగా.. సఫారి 5.22, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ 2, శామ్‌సంగ్ ఇంటర్నెట్ 1.5, మొజిల్లా ఫైర్‌ఫాక్స్ 1.28 శాతంతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి. 2024 చివరి నాటికి ఆత్మనిర్భర్ బ్రౌజర్ కూడా ఈ జాబితాలోకి చేరనున్నట్లు తెలుస్తోంది.

Editor