Latest Posts

ఫుడ్, కూల్‍డ్రింక్స్‌పై ఆఫర్లు ప్రకటించిన పీవీఆర్ సినిమాస్..

కొంతకాలంగా సినిమా థియేటర్లలో ఫుడ్ ఐటెమ్స్, కూల్‍డ్రింక్స్ ధరలు భారీగా ఉంటున్నాయి. మల్టీప్లెక్స్ థియేటర్లో ఏదైనా తినాలంటే జనాలు టికెట్ కంటే రెట్టింపు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది.

పాప్‍కార్న్‌, సమోసాలు, సాండ్‍విచ్‍లు, కూల్‍డ్రింక్స్ సహా థియేటర్లలో అన్నింటి ధర చాలా ఎక్కువగా ఉంటున్నాయి. థియేటర్లలో అధిక ధరలపై సోషల్ మీడియాలో అనేక పోస్టులు, జోక్స్ కూడా తరచూ వస్తుంటాయి. మల్టీప్లెక్స్‌లో స్నాక్స్ (ఫుడ్ ఐటెమ్స్) తినాలంటే ఆస్తులు, కిడ్నీలు అమ్ముకోవాల్సిందేనన్న జోక్స్ కూడా పేలుతుంటాయి.

ఇటీవల నొయిడాకు చెందిన ఓ వ్యక్తి పీవీఆర్ సినిమాస్‍లో తనకు అయిన బిల్‍ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నోయిడాలోని పీవీఆర్ సినిమాస్‍లో 55 గ్రాముల చీజ్ పాప్‍కార్న్ కు రూ.460, 600ml పెప్సీకి రూ.360 బిల్ వేశారని తెలిపారు. రెండింటికి బిల్ రూ.820 అయిందని వెల్లడించారు. ఈ డబ్బుతో ఏడాది మొత్తం అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‍స్క్రిప్షన్ తీసుకోవచ్చని పేర్కొన్నారు. సినిమాలకు జనాలు రాకపోవడంలో ఆశ్చర్యం లేదని, కుటుంబంతో థియేటర్లో మూవీ చూడాలంటే ఖర్చులు భరించలేని విధంగా మారాయని పోస్ట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలా మంది థియేటర్లలో ధరల దోపిడీ గురించి కామెంట్లు చేశారు. ఈ వ్యవహారం మరోసారి వైరల్ అయింది. దీంతో పీవీఆర్ సినిమాస్ దిద్దుబాటు చర్యలకు ఇప్పుడు దిగింది.

ఆ ట్వీట్ చేసిన వారానికి ఇప్పుడు పీవీఆర్ సినిమాస్ స్పందించింది. కొత్త ఆఫర్లను ప్రకటించింది. వీక్‍డే ఆఫర్ కింద సోమవారం నుంచి గురువారం మధ్య ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు బర్గర్, సమోసా, సాండ్‍విచ్+పెప్సీ రూ.99కే అందించనున్నట్టు పీవీఆర్ సినిమాస్ ట్వీట్ చేసింది. అలాగే అన్‍లిమిటెడ్ వీకెండ్ ఆఫర్ కింద శుక్రవారం నుంచి ఆదివారం వరకు అన్‍లిమిటెడ్ పాప్‍కార్న్, అన్‍లిమిటెడ్ పెప్సీ రిఫిల్స్ పొందవచ్చని తెలిపింది. అంటే వీకెండ్‍లలో ఒక్కసారి పాప్‍కార్న్ తీసుకుంటే ఆ టబ్‍లో ఎన్నిసార్లయినా అన్‍లిమిటెడ్‍గా ఫిల్ చేయించుకోవచ్చని పీవీఆర్ పేర్కొంది. పెప్సీ కూడా ఎంతైనా పొందవచ్చని తెలిపింది.

YES9 TV