రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీలతో తీసుకు రూ. 900 కోట్లు నిధులు పక్కదారి పట్టాయంటూ పిఏసి ఛైర్మన్ పయ్యావుల సంచలన ఆరోపించారు. ఏపీ ప్రభుత్వ సహకారంతో భారీ స్కాంకు పాల్పడ్డారన్నారు.
రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో భారీ దోపిడీకి తెర లేపారని, రాయలసీమ కరవు నివారణ కార్పోరేషన్ పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో అప్పులు చేశారని వివరించారు.
ప్రభుత్వ గ్యారంటీతో తీసుకున్న రుణానికి సంబంధించిన డబ్బులు నేరుగా ప్రైవేట్ కంపెనీల ఖాతాల్లోకి వెళ్లిందని, కార్పోరేషన్ అకౌంట్లకు రాకుండా నేరుగా కాంట్రాక్టు సంస్థకు ఆ డబ్బులు వెళ్లాయని చెప్పారు. సుమారు రూ. 900 కోట్ల డబ్బులు దారి మళ్లించారని చెప్పారు.
దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా నిధుల దోపిడీ జరిగిందని పయ్యావుల అన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టాలని, ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ నిమిత్తం రుణం తీసుకున్నారని, ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ జరిగాయా..? లేవా అనేది మాత్రం తెలియడం లేదని ఆరోపించారు. ఈ కుంభకోణంలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆర్ఈసీలోని కొందరు భాగస్వాములయ్యారని చెప్పారు.
ప్రభుత్వ గ్యారంటీలతో తీసుకున్న రుణానికి చెల్లింపులు కూడా చేస్తున్నారని, ఈ ఏడాది మార్చి 29న బ్యాంక్ గ్యారెంటీ ఇస్తూ గెజిట్ జారీ చేస్తే.. మూడు రోజుల్లో రుణం ఇచ్చేశారని చెప్పారు. అధికార పార్టీ ముఖ్యుడికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి, ఏపీలో అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు సహా, మెజారిటీ సాగునీటి ప్రాజెక్టులకు కాంట్రాక్టర్‌గా ఉన్న సంస్థ ఖాతాలోకి రుణాన్ని నేరుగా పంపిందని ఆరోపించారు.
ప్రభుత్వానికి వచ్చే ఆదాయమైనా, తీసుకునే రుణమైనా మొదట కన్సాలిడేటెడ్ ఫండ్‌లోకి రావాలని రాజ్యాంగం చెబుతోందని, కానీ ప్రభుత్వం ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీల నుంచి తీసుకున్న రుణం కన్సాలిడేటెడ్ ఫండ్‌లోకి, ఏపీ రాయలసీమ కరవు నివారణ ప్రాజెక్టుల అభివృద్ధి సంస్థ(ఏపీఆర్‌డీఎంపీడీసీఎల్) ఖాతాలోకి పంపలేదని, నేరుగా కాంట్రాక్టు సంస్థ ఖాతాలోకి నిధులు వెళ్లిపోయాయన్నారు.
దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైన చర్యకు పాల్పడదని, దీనికి ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీలూ బాధ్యత వహించాలన్నారు. ఈ కుంభకోణం సూత్రధారులెవరో, పాత్రధారులెవరో నిగ్గుతేల్చేందుకు సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.
ఎలక్ట్రో మెకానికల్ పనులు జరిగాయో లేదో రాష్ట్ర ప్రభుత్వంగానీ, ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీలుగానీ నిర్ధారించుకుండానే చెల్లింపులు చేశాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో తీసుకున్న రుణం ప్రభుత్వ ఖాతాలోకి రాకుండా, నేరుగా గుత్తేదారు ఖాతాలోకే వెళ్లిపోతుంటే… రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వ సంస్థ ఎక్కడ అప్పులు చేస్తోందో, అది ఎవరి ఖాతాల్లోకి వెళ్లిపోతుందో తెలియదన్నారు.
