యూకేకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్న భారతీయులకు బ్యాడ్ న్యూస్! వీసా ఫీజులను పెంచుతూ.. ఆ దేశ ప్రధానమంత్రి రిషి సునక్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
వీసా ఫీజుతో పాటు దరఖాస్తుదారులు చెల్లించే హెల్త్ సర్ఛార్జీలను కూడా పెంచుతున్నట్టు స్పష్టం చేశారు. ఎంత పెంపు ఉంటుంది? అన్న విషయంపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. కానీ వీసా ఫీజు 15శాతం నుంచి 20శాతం వరకు పెరగొచ్చు అని పలు నివేదికలు చెబుతున్నాయి.
ఎందుకు ఈ నిర్ణయం..?
యూకేలోని పబ్లిక్ సెక్టార్లో పనిచేస్తున్న వారి జీతాలను పెంచేందుకు రిషి సునక్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉపాధ్యాయులు, పోలీసులు, జూనియర్ డాక్టర్లు,ఇతర వర్కర్లు ఈ కేటగిరీ కిందకి వస్తారు. కనీసం 5- 7శాతం వరకు వారి జీతాలను పెంచే యోచనలో ఉన్నట్టు బ్రిటన్ ప్రధాని ఇప్పటికే తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే.. ద్రవ్యోల్బణంపై భయాలు కొనసాగుతున్న వేళ, అప్పు చేసి జీతాలు పెంచే ఉద్దేశం లేదన్న ఆయన.. అందుకే వేరే మార్గాల ద్వారా నిధులను సమీకరిస్తున్నట్టు స్పష్టం చేశారు.
UK visa fee increase : “పబ్లిక్ సెక్టార్ ఉద్యోగుల జీతాన్ని పెంచాలని నిర్ణయించుకుంటే.. వేరే ఎక్కడి నుంచైనా నిధులు తెచ్చుకోవాలి. ప్రజల ట్యాక్స్‌ల నుంచి తీసే ఉద్ధేశం నాకు లేదు. ద్రవ్యోల్బణం భయాల కారణంగా అప్పు చేయాలనీ లేదు,” అని మీడియా సమావేశంలో వెల్లడించారు రిషి సునక్.
ఇదీ చూడండి:- US H-1B visa news: హెచ్ 1 బీ వీసాదారుల కుటుంబ సభ్యులకు శుభవార్త
“అందుకే నిధుల కోసం కొన్ని మార్గాలను చూస్తున్నాము. దేశంలోకి వచ్చే ఇమ్మిగ్రెంట్స్‌పై వేసే ఛార్జీలను పెంచాలని భావిస్తున్నాము. ఎన్హెచ్ఎస్ (నేషనల్ హెల్త్ సర్వీస్) సేవలు పొందేందుకు వీసా సమయంలో కొంత చెల్లించాల్సి ఉంటుంది. దానిని పెంచుతున్నాము. దీని ద్వారా మేము 1 బిలియన్ బ్రిటన్ పౌండ్‌ను సమకూర్చుకోగలుగుతాము. వీసా ఫీజులు పెంచి చాలా రోజులైంది. అందుకే ఇప్పుడు పెంచాలని మేము తీసుకున్న నిర్ణయం సరైనదే,” అని ప్రధాని పేర్కొన్నారు.
