Latest Posts

ఏపీలో ఇసుక తవ్వకాలపై నిషేధం -! సమర్థించిన సుప్రీంకోర్టు

ఏపీ సర్కార్ కు షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఏపీలో ఇసుక తవ్వకాల విషయంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై గతంలో వచ్చిన ఫిర్యాదులను విచారించిన జాతీయ హరిత ట్రైబ్యునల్ వీటిపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

వీటిపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వానికి ఊరట దక్కలేదు. ఎన్టీటీ ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.ఫలితంగా ఏపీలో ఇసుక తవ్వకాలు నిలిచిపోనున్నాయి.

ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై గతేడాది మార్చి 23న ఎన్జీటీ నిషేధం విధించింది. దీన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం విచారణ జరిపింది. వాదోపవాదాలు విన్న తర్వాత ఎన్టీటీ తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ఎన్జీటి తీర్పును సుప్రీంకోర్టు సమర్ధిస్తూ, దాన్ని యథాతధంగా అమలు చేయాలని ఆదేశించింది. రాష్ట్రంలో అడ్డగోలుగా కొనసాగుతున్న ఇసుక తవ్వకాలను నిషేధించాలంటూ ఎన్జీటి ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది.

బి2 కేటగిరీ ఇసుక రీచ్‌లలో పాక్షికంగా యంత్రాలతో ఇసుక త్వవకానికి అనుమతి ఇవ్వడం చట్ట విరుద్దమని ఎన్జీటి పేర్కొంది. బి1, బి2 కేటగిరీల కింద ఇసుక తవ్వకాల కోసం ఇప్పటికే ఇచ్చిన అన్ని రకాల పర్యావరణ అనుమతులను పరిశీలన చేయాలని ఎన్జీటి ఆదేశించింది. రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా సంస్థ పర్యావరణ అనుమతులను పునః పరిశీలన చేయాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఇసుక రీచ్‌ల పరిధిలో పర్యావరణ విధ్వంసం పరిశీలన, అంచనా కోసం ఎన్జీటి నిపుణుల కమిటీని నియమించింది. ఇసుక తవ్వకాలతో పర్యావరణానికి జరిగిన నష్టాన్ని గుర్తించాలని కూడా నిపుణుల కమిటీని ఆదేశించింది. రివర్ బెడ్లు, నదీ తీరాల్లో భారీ యంత్రాలతో మైనింగ్ చేసుకోవచ్చంటూ అనుమతివ్వడంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పర్యావరణ శాఖ కార్యదర్శిని ఆదేశించింది. ఎన్జీటి విధించిన రూ.18 కోట్ల జరిమానాపై మాత్రమే సుప్రీం ధర్మాసనం స్టే విధించింది. ప్రతివాదులైన నాగేంద్ర కుమార్, హేమకుమార్‌లకు న్యాయస్థానం నోటీసులు జారీచేసింది.

Posted Under AP
YES9 TV