తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఓ పోకిరీ చేతిలో పెట్టారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీని స్కాంగ్రెస్‌గా అభివర్ణించారు కేటీఆర్. బహిరంగంగా బెదిరింపులకు పాల్పడే వ్యక్తికి పార్టీని అప్పగించడం బాధాకరమని మంత్రి కేటీఆర్ అన్నారు.
గురువారం రాత్రి సుమారు 12.15 గంటల సమయంలో కొందరు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుచరులమంటూ తనను బెదిరించినట్లు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ట్విట్టర్ వేదికగా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డిని విమర్శిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ బెదిరించారని.. వారిపై సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించినట్లు దాసోజు శ్రవణ్ తెలిపారు.
దాసోజు ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఘటనపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహమూద్ అలీ, తెలంగాణ డీజీపీని కేటీఆర్ కోరారు. ఇలాంటి ఘటనలు తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు మంత్రి కేటీఆర్.
దాసోజు శ్రవణ్ కూడా ఈ బెదిరింపు కాల్స్‌పై విచారణ జరిపి దోషులను గుర్తించి, చట్టపరమైన చర్యలు చేపట్టాలని అభ్యర్థిస్థానని అన్నారు. తెలంగాణలో బెదిరింపు, రౌడీ రాజకీయాల సంస్కృతిని పెంచి పోషించే పనిలో రేవంత్ రెడ్డి నిమగ్నమై ఉండటం దురదృష్టకరమని అన్నారు.
గతంలో కూడా తన అనుచరుల ద్వారా వీ హనుమంతరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి తదితర సీనిర్లతో సహా తన సొంత పార్టీ సభ్యులపై ఇలాంటి బెదిరింపులకు పాల్పడిన ఆయన ఇలాంటి వ్యూహాలను ప్రయోగించడం ఇదే తొలిసారి కాదని శ్రవణ్ గుర్తు చేశారు. ఈ రౌడీ రాజకీయాలు, చౌకబారు వ్యూహాలు, ప్రజాస్వామ్యం, న్యాయం కోసం పోరాడకుండా తనను అడ్డుకోలేవని రేవంత్ తెలుసుకోవాలన్నారు. 125 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీలో ఇలాంటి రౌడీ ఎలిమెంట్స్ ఎలా ప్రోత్సహిస్తున్నారు? అని దాసోజు ప్రశ్నించారు.
