Latest Posts

మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థ మోసం; కేసు నమోదు!!

చాలా మంది సినీ హీరోలు అనేక వ్యాపార సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉంటారు. ఇక వారి ప్రకటనలు చూసిన చాలా మంది ఆ ప్రకటన లకు ఆకర్షితులై సదరు వ్యాపార సంస్థలలో ఏదైనా కొనుగోలు చేయడం లేదా పెట్టుబడి పెట్టడం చేస్తూ ఉంటారు.

ఇక ఆ సంస్థలు నమ్మకమైనవి అయితే ఓకే కానీ, సదరు సంస్థలు మోసపూరితమైనవి అయితే అందులో పెట్టుబడులు పెట్టిన వారు లబోదిబోమంటారు.

ఇక ఆ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన సినిమా హీరోల రిప్యుటేషన్ కూడా కొన్నిసార్లు దెబ్బతింటుంది. ఇక తాజాగా అటువంటి ఉదంతమే తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థ శ్రీ సాయి సూర్య డెవలపర్స్ ప్లాట్ల పేరుతో జనాల నుండి డబ్బులు కట్టించుకుని వారికి ప్లాట్లు ఇవ్వకుండా, తిరిగి డబ్బులు కూడా ఇవ్వకుండా టోకరా వేసింది.

 

దీంతో సదరు సంస్థ చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయిన బాధితులు చివరకు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మధుర నగర్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. తాము ప్రకటనలు చూసి మోసపోయామని, మహేష్ బాబు వంటి స్టార్ హీరో నమ్మకమైన సంస్థగా చెబితే నమ్మి పెట్టుబడి పెట్టామని ప్రస్తుతం తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

శ్రీ సాయి సూర్య డెవలపర్స్ అధినేత సతీష్ చంద్ర గుప్తా పై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం 30 మంది బాధితులు శ్రీ సాయి సూర్య డెవలపర్స్ పై ఫిర్యాదు చేశారు. వీరు చేసిన ఫిర్యాదు మేరకు సాయి సూర్య డెవలపర్స్ పై సెక్షన్ 406, 420 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

రియల్ లైఫ్ లో ఎలాంటి మచ్చ లేని మహేష్ బాబు సాధారణంగా ఎలాంటి కాంట్రవర్సీలకు అయినా దూరంగానే ఉంటారు. కానీ వాణిజ్య ప్రకటనల విషయంలో కూడా తాజా ఘటనతో ఆయన జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని, మోసపూరిత సంస్థలకు యాడ్స్ చెయ్యకుండా ఉండాలని కోరుతున్నారు పలువురు మహేష్ బాబు అభిమానులు

YES9 TV