ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నారు.
ఒకరిపై ఒకరు కర్రలు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ గొడవతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. తీవ్ర భయాందోళనకు గురైన గ్రామస్థులు దాడి ఘటనపై పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అసలేం జరిగింది?
ఎన్టీఆర్ జిల్లా తుర్లపాడు గ్రామంలో రెండు కుటుంబాల మధ్య వివాదం చెలరేగింది. దీంతో పరస్పరం దాడి చేసుకున్నారు. పాత గొడవలు నేపథ్యంలో ఈ ఘర్షణ తలెత్తి ఒకరిపై ఒకరు కర్రలు, గోడ్డళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. మేనత్త, మేనమామ కుటుంబాల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఈ వివాదం మరింత ముదిరి పరస్పరదాడులకు దిగారు. ఈ ఘర్షణలో గాయపడిన ఐదుగురిని నందిగామ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘర్షణలో ముగ్గురిపై యాసిడ్ దాడి జరిగినట్లు తెలుస్తోంది. వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విజయవాడలో ఫుడ్ కోర్టు వద్ద ఓ షాపు ఏర్పాటు విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం నెలకొంది. ఈ ఘటనలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి అనుచరుడిపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు అనుచరులు దాడికి పాల్పడ్డారు. విజయవాడలో ఏర్పాటుచేసిన ఫుడ్ కోర్టు విషయంలో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. పర్యాటకలు ఆహ్లాదకరంగా గడిపే ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే, మేయర్ అనుచరులు దాడులకు దిగుతున్నారు. ఫుడ్ కోర్టులో కేటాయించిన దుకాణాల్లో అవకతవకాలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. మేయర్ భాగ్యలక్ష్మి చెప్పారని కొత్తగా బిర్యానీ బండిని పెట్టించేందుకు ఇద్దరు వీఎంసీ ఉద్యోగులను ఇచ్చి ఫుడ్ కోర్టుకు పంపించారు. అయితే బిర్యానీ బండి పెట్టాలంటే ఎమ్మెల్యే అనుమతి కావాలని, మేయర్ ఎవరు చెప్పడానికి అని విష్ణు అనుచరులు వీఎంసీ ఉద్యోగులను నిలదీశారు. వీఎంసీ ఉద్యోగులతో పాటు బండి పెట్టేందుకు వచ్చిన వ్యక్తిపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి దిగారు. మేయర్ మనుషులమని తెలిసే తమపై దాడి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.
