ముఖ్యమంత్రి పదవికి జగన్ అర్హుడు కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. వారాహి యాత్ర రెండో విడతలో భాగంగా ఏలూరులో నిర్వహించిన సభలో పవన్ మాట్లాడారు.
సీఎం జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం లోపాలను కాగ్ నివేదిక ఎత్తిచూపిందన్నారు. మనందరం సీఎం జగన్ బానిసలం కాదన్నారు. జగన్ కు మనకంటే ఎక్కువ బాధ్యత ఇచ్చాం అంతే అన్నారు. శ్రామికుల కష్టం నుంచి వచ్చిన ఖజానాకు సీఎం జగన్ జవాబుదారీ మాత్రమే అన్నారు. ఏపీ ఖజానా దాదాపు రూ.10 లక్షల కోట్లు అన్న పవన్… ఈ డబ్బు సరిగ్గా ఖర్చు పెడుతున్నారా లేదా అని కాగ్ పరిశీలిస్తుందన్నారు. ఏపీ ప్రభుత్వం ఖర్చులపై కాగ్ నివేదికలో 25 లోపాలను ఎత్తిచూపిందన్నారు. వైసీపీ ప్రభుత్వం రూ.1.18 లక్షల కోట్లు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ చేసిందన్నారు. సీఎం జగన్ , ఆయన మంత్రి వర్గం ఈ రూ.1.18 లక్షల కోట్లు ఎలా ఖర్చు పెట్టారో ప్రెస్ మీట్ పెట్టి లెక్కలు చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో రూ.22 వేల 504 కోట్లు, రోడ్ల పేరు చెప్పి రూ.4754 కోట్లు అప్పు తెచ్చారని, వాటి లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇకపై ఏకవచనంతోనే పిలుస్తా
ముఖ్యమంత్రి పదవికి విలువ ఇస్తాను కానీ జగన్‌కు కాదని పవన్ అన్నారు. వైసీపీ నాయకులు నా కుటుంబం గురించి, నా బిడ్డల గురించి నీచంగా మాట్లాడుతున్నారని, ఎంత దిగజారుడుతనంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంను ఇక నుంచి ఏకవచనంతోనే పిలుస్తానని పవన్ అన్నారు. వైసీపీ నాయకులను నువ్వు అని ఏకవచనంతో మాట్లాడతానన్నారు. వైసీపీ ఈ రాష్ట్రానికి సరైనది కాదన్నారు. ఏలూరులో వరదల వస్తే ఎందుకు మునిగిపోతుందని, కాలువలకు రక్షణ గోడలు ఏమయ్యాయని పవన్ ప్రశ్నించారు.
“మా రెల్లి సోదరులు చెప్తున్నారు. చెత్త శుభ్రం చేసే వారి మీద కూడా చెత్తకు టాక్సులు వేసే చెత్త ముఖ్యమంత్రి జగన్. ఈరోజు నుంచి ముఖ్యమంత్రిని ఏకవచనంతో నువ్వు అనే పిలుస్తా. జగన్ ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు. ఏలూరు సభ నుంచి మహానుభావుడు అంబేడ్కర్ సాక్షిగా చెబుతున్నా దిగజారి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్ ను ఇక నుంచి నువ్వు అని ఏకవచనం తోనే పిలుస్తాను.”- పవన్ కల్యాణ్
వాలంటీర్ వ్యవస్థపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి గ్రామంలో ఎవరు ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారు, ఏ కుటుంబంలో ఎంత మంది ఉన్నారు, ఆడపిల్లలు ఎవరినైనా ప్రేమిస్తున్నారా? వారిలో వితంతువులు ఉన్నారా? అని సమాచారం సేకరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. వాలంటీర్లు కీలక సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకు చేరవేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో కేంద్ర నిఘా వర్గాలు తనను హెచ్చరించాయన్నారు. ఇందులో వైసీపీ నేతల హస్తం ఉందన్నారు.
