భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఏసీ ఛైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధరలపై 25 శాతం డిస్కౌంట్ ఇచ్చేందుకు నిర్ణయించింది. ఆయా తరగతులున్న అన్ని రైళ్లకు ఇది వర్తిస్తుంది.
టికెట్ ధరలను నిర్ణయించే అధికారాన్ని జోన్లలో ఉండే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌కు కట్టబెట్టింది. వందేభారత్ (Vande Bharat) సహా అనుభూతి, విస్టాడోమ్ కోచ్‌లు ఉన్న రైళ్లకు కూడా వర్తిస్తుంది.
ఆక్యుపెన్సీ ఆధారంగా టికెట్ ధరలపై రాయితీ ఇవ్వనున్నారు. ఆక్యుపెన్సీ పెంచే లక్ష్యంతో రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లు విరివిగా అందుబాటులోకి వచ్చాయి. మరికొన్ని ప్రాంతాల్లో రాబోతున్నాయి. కొన్ని మార్గాల్లో ఆదరణ బాగానే ఉన్నప్పటికీ మరికొన్ని మార్గాల్లో ఆక్యుపెన్సీ కనీసం 50 శాతం కూడా ఉండటంలేదు. అంతేకాకుండా ఎండలు తగ్గి వర్షాలు కురుస్తుండటంతో ఏసీ బోగీల్లో ప్రయాణించేందుకు అనుకున్న స్థాయిలో డిమాండ్ ఉండటంలేదు.
ఆక్యుపెన్సీ పెంచాలనే ఉద్దేశంతో రైల్వే బోర్డు ఈ పథకంతో ముందుకొచ్చింది. రాయితీ అనేది టికెట్ ధరలో 25 శాతం ఇవ్వనున్నారు. రిజర్వేషన్, సూపర్ ఫాస్ట్ సర్‌ఛార్జి, జీఎస్టీ వంటి ఇతర ఛార్జీలు మాత్రం ఉంటాయి. గడిచిన 30 రోజుల్లో 50 శాతం కన్నా తక్కువ ఆక్యుపెన్సీ కలిగిన రైళ్లను పరిగణనలోకి తీసుకోవాలని బోర్డు సూచించింది.
రాయితీ నిర్ణయించేందుకు ప్రజలకు ఆ మార్గంలో ఉన్న ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. రైలు ప్రయాణించే దూరం లేదంటే ఎంపిక చేసిన స్టేషన్ల మధ్య కానీ రాయితీ ధరను వర్తింప చేస్తారు. తక్షణమే ఈ సౌకర్యాన్ని అమలు చేస్తున్నప్పటికీ ముందుగా టికెట్లు బుక్ చేసుకున్నవారికి మాత్రం మినహాయింపు లేదని స్పష్టం చేసింది.
