తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరుగనున్న ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో క్షేత్ర స్థాయి పర్యటనలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు.
ఇప్పటికే జూన్ నెలలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు, జిల్లాల పర్యటన, మహారాష్ట్ర పర్యటనలో బిజీగా గడిపిన తెలంగాణ సీఎం కేసీఆర్ మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల మూడవ వారం నుండి క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడానికి, ప్రజల మద్దతును సాధించడానికి రంగంలోకి దిగిన కేసీఆర్ ఈ క్రమంలో ఈ నెల మూడవ వారం నుంచి వరుస కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు అని తెలుస్తోంది. ఈ మేరకు షెడ్యూల్ రెడీ చేస్తున్నారని సమాచారం.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 15వ తారీకు తర్వాత ఐదు జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేయనున్నారు. అయితే సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్ ను మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో ఖరారు చేసే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ నల్గొండ, సూర్యాపేట, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలలో ఈ నెలలో పర్యటించనున్నారు అని సమాచారం.
జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలు, టిఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ప్రారంభం తోపాటుగా బహిరంగ సభలలో కేసీఆర్ పాల్గొనే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నెలలో ఆదిలాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన ఉన్నట్టు సమాచారం. జిల్లా కలెక్టరేట్ సముదాయం, జిల్లా పార్టీ కార్యాలయం తోపాటు చనాకా కొరాటా ప్రాజెక్ట్ ను కేసీఆర్ ప్రారంభించే అవకాశం ఉందని చెబుతున్నారు.
అంతేకాదు ఈ సందర్భంగా అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించడానికి పార్టీ ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా సమాచారం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కూడా కలెక్టరేట్ భవన సముదాయంతో పాటు, మెడికల్ కళాశాలను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని సమాచారం. ఆ మరుసటి రోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగే సభకు సీఎం కేసీఆర్ హాజరవుతారని తెలుస్తుంది.
ఇప్పటికే మెదక్, కరీంనగర్ జిల్లాల కలెక్టరేట్ సముదాయాలు ప్రారంభోత్సవానికి రెడీ అయ్యాయి. కలెక్టరేట్ల ప్రారంభోత్సవాలు లేని చోట్ల కూడా సీఎం కేసీఆర్ బహిరంగ సభలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటనల దూకుడు పెంచాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ నెలలో కెసిఆర్ 5 జిల్లాల పర్యటన షెడ్యూల్ సిద్ధం అవుతుంది.
