ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనితీరుపై నమ్మకంతోనే తాను మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరినట్టు ప్రకటించారు ఎన్సీపీ నేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్.
శివసేనతో కలిసి పనిచేయగా లేనిది, బీజేపీతో కలిస్తే తప్పేముందని ప్రశ్నించారు.
‘ఎన్సీపీ మొత్తం నావెంటే ఉంది..’
తీవ్ర నాటకీయ పరిణామాల మధ్య ఆదివారం మధ్యాహ్నం మహారాష్ట్ర ప్రభుత్వంలో కలిశారు అజిత్ పవార్. రాజ్ భవన్లో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ఆయనతో పాటు ఉన్న పలువురు ఎన్సీపీ ఎమ్మెల్యేలు కూడా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు అజిత్ పవార్.
“ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇతర దేశాల్లో కూడా ఆయన పాప్యులర్ అయ్యారు. ఆయనకు మద్దతు లభిస్తోంది. 2024 లోక్‌సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తాము. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇప్పుడు చాలా మంది మమ్మల్ని విమర్శిస్తారు. మేము పట్టించుకోము. మహారాష్ట్ర అభివృద్ధికే మేము పనిచేస్తాము. మా ఎమ్మెల్యేలు కూడా సంతృప్తికరంగా ఉన్నారు. నాగాలండ్‌లో ఎన్సీపీకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండేవారు. పార్టీ నిర్ణయంతో వారందరు బీజేపీతో చేరారు. నాగాలాండ్‌లో చేసింది, మహారాష్ట్రలో ఎందుకు చేయలేరు? శివసేనతో కలిసి పనిచేయగా లేదని బీజేపీతో కలిస్తే తప్పేముందు?” అని అజిత్ పవార్ వ్యాఖ్యానించారు.
తనకు ఎన్సీపీలో అందరు ఎమ్మెల్యేల మద్దతు ఉందని అన్నారు అజిత్ పవార్.
“కొందరు ఎమ్మెల్యేలతో మాట్లాడలేకపోయాము. వారు విదేశాల్లో ఉన్నారు. మిగిలిన వారు మా నిర్ణయానికి మద్దతిచ్చారు. ఎన్సీపీ పెద్దలకు కూడా ఈ విషయాన్ని చెప్పాము. మా దగ్గర నంబర్లు ఉన్నాయి. ఎమ్మెల్యేలందరు మాతోనే ఉన్నారు. ఇక్కడికి మేము పార్టీగానే వచ్చాము. పార్టీని చీల్చే ఉద్దేశం మాకు లేదు. ప్రజాస్వామ్యానికి మెజారిటీ లభించింది. మా పార్టీకి 24ఏళ్లు నిండాయి. నూతన నాయకత్వం అవసరం ఉంది,” అని అజిత్ పవార్ అభిప్రాయపడ్డారు.
రానున్న రోజుల్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, పోర్ట్‌ఫోలియోలను త్వరలోనే వెల్లడిస్తామని పవార్ అన్నారు.
ప్రధాని మోదీపై శరద్ పవార్ సెటైర్లు..
Sharad pawar on Ajit Pawar : అజిత్ పవార్ తాజా నిర్ణయంపై ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ స్పందించారు.
“ఎన్సీపీ గురించి రెండు రోజుల క్రితం ప్రధాని మాట్లాడారు. ఎన్సీపీ పని అయిపోయిందన్నారు. ఎన్సీపీ నేతలపై అవినీతి ఆరోపణలు చేశారు. ఇప్పుడు మా పార్టీలోని కొందరు ప్రమాణస్వీకారం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వంతో కలవడంతో వారిపై ఉన్న ఆరోపణలు తొలగిపోతాయి. నాకు సంతోషంగా ఉంది. మోదీకి ధన్యవాదాలు,” అని శరద్ పవార్ వెల్లడించారు.
