Latest Posts

‘శిందేను తప్పించి అజిత్​ పవార్​ సీఎం అవుతారు- బీజేపీ ప్లాన్​ ఇదే!’

మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపణలు సృష్టించిన డిప్యూటీ సీఎం, ఎన్​సీపీ సీనియర్​ నేత అజిత్​ పవార్​, బీజేపీలపై తీవ్రస్థాయిలో మండిపడింది ఉద్దవ్​ ఠాక్రేకు చెందిన శివసేన.

ఏక్​నాథ్​ శిందేను తప్పించి మహారాష్ట్ర సీఎం అవ్వాలన్న ఉద్దేశంతోనే బీజేపీతో అజిత్​ పవార్​ చేతులు కలిపినట్టు ఆరోపించింది. ఈ మేరకు తమ పత్రిక సామ్నాలో ఓ వ్యాసం రాసుకొచ్చింది.

‘పవార్​తో శిందేకే ముప్పు..!’

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపునకు దారి తీస్తూ.. ఆదివారం మధ్యాహ్నం ప్రభుత్వంతో కలిశారు అజిత్​ పవార్​. ఆ వెంటనే డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ఆయనతో పాటు వెళ్లిన పలువురు ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ పరిణామాలు ఎన్​సీపీ వ్యవస్థాపకుడు శరద్​ పవార్​ను షాక్​కు గురిచేశాయి. తాజాగా ఈ వ్యవహారంపై సామ్నా పత్రికలో పలు కీలక వ్యాఖ్యలు చేసింది ఉద్ధవ్​ ఠాక్రే శివసేన వర్గం.

“డిప్యూటీ సీఎంగా ప్రమాణాలు చేస్తూ అజిత్​ పవార్​ రికార్డు సృష్టించారు. కానీ ఈసారి బలమైన ఒప్పందమే జరిగింది. డిప్యూటీ సీఎం పదవి కోసం పవార్​ అక్కడికి వెళ్లలేదు. ఏక్​నాథ్​ శిందేతో పాటు ఆయన వెంట వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుంది. ఆ తర్వాత సీఎంగా అజిత్​ పవార్​ ప్రమాణం చేస్తారు. కానీ ప్రజలు దీనిని సహించరు. ఇలాంటి వాటికి ప్రజలు మద్దతివ్వరు,” అని మరాఠా దినపత్రిక సామ్నా రాసుకొచ్చింది.

ఇదీ చూడండి:- Ajit Pawar : ‘బీజేపీతో కలిస్తే తప్పేంటి? ఎన్​సీపీ మొత్తం నావెంటే ఉంది!’- అజిత్​ పవార్​

వాస్తవానికి అజిత్​ పవార్​తో శిందేకే ముప్పు ఎక్కువగా ఉందని, ఈ విషయం ఆయనకు కూడా తెలుసని ఆరోపించింది సామ్నా.

“అజిత్​ పవార్​ వల్లే తాము ఉద్ధవ్​ ఠాక్రేను వదిలేస్తున్నామని గతేడాది రెబల్​ ఎమ్మెల్యేలు చేప్పారు. పవార్​ను ఉద్ధవ్​ కంట్రోల్​ చేయలేకపోయారని ఆరోపించారు. మరి వారందరు ఇప్పుడేం చేస్తారు? ఎన్​సీపీ వల్లే శివసేనను వదిలేస్తున్నామని చెప్పిన వారి పరిస్థితేంటి? వారి ముఖల్లోనే ఆందోళన కనిపిస్తోంది. అజిత్​ పవార్​ వల్ల తమ రాజకీయ భవిష్యత్తు అంధకారమైందని వారికి కూడా తెలుసు,” అని సామ్నా పేర్కొంది.

YES9 TV