Latest Posts

ఇక న్యూయార్క్‌లో దీపావళి నాడు పబ్లిక్ హాలిడే

వాషింగ్టన్: చీకటిని పారదోలి అందరి జీవితాల్లోనూ వెలుగులు నింపే దీపావళి పండగకు అగ్రరాజ్యం అమెరికాలో అరుదైన గుర్తింపు ఉంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే ఈ పండగ వేడుకలు అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో కూడా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

గత ఏడాది ఏర్పాటైన దీపావళి సంబరాలను ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

అంతటి ప్రాముఖ్యత ఉన్న దీపావళి పండగ మరో మైలురాయిని అందుకుంది. న్యూయార్క్‌లో దీపావళి పండగను సెలవురోజుగా ప్రకటించారు నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది దీపావళి పండగ నుంచే ఈ సెలవును అమల్లోకి తీసుకొస్తామని అన్నారు. న్యూయార్క్ సిటీ పరిధిలో ఉన్న అన్ని విద్యాసంస్థలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవు వర్తిస్తుందని తెలిపారు.

న్యూయార్క్‌లో నివాసం ఉండే సుమారు ఆరు లక్షలమంది ఇకపై దీపావళి పండుగను జరుపుకొంటారని ఆయన స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన బిల్లు సభామోదం పొందిందని వివరించారు. బిల్లు ఆమోదం పొందడాన్ని- 60వ దశాబ్దంలో నల్లజాతీయులు పొందిన పౌర హక్కుల విజయాలతో సమానంగా అభివర్ణవించారు మేయర్. అమెరికన్లు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్‌, జాతిపిత మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకున్నారని వ్యాఖ్యానించారు.

వచ్చే ఏడాది న్యూయార్క్ సిటీ స్కూల్ క్యాలెండర్‌లో 182 రోజుల పాటు విద్యా సంస్థలు, పాఠశాలలు నడవాల్సి ఉంది. సెప్టెంబర్ 8వ తేదీన విద్యా సంవత్సరం ఆరంభమౌతుంది. వచ్చే సంవత్సరం జూన్ 27వ తేదీన ముగుస్తుంది. మంచు కురిసే సీజన్లను అమెరికన్ ప్రభుత్వం రిమోట్ లెర్నింగ్ డేస్‌గా పరిగణిస్తుంది. సెలవు రోజున న్యూయార్క్ నగరాన్ని విద్యుద్దీపాలతో అలంకరిస్తామని ఆడమ్స్ పేర్కొన్నారు.

 

కాగా దీపావళి పండగ రోజున ఫెడరల్ హాలిడే ప్రకటించాలంటూ యూఎస్ హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్.. ఓ బిల్లును ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దివాళీ డే యాక్ట్ పేరుతో రూపొందించిన ఈ బిల్లును డెమొక్రటిక్ పార్టీకి చెందిన సభ్యురాలు గ్రేస్ మెంగ్ ఇటీవలే సభలో ప్రవేశపెట్టారు. న్యూయార్క్ ఆరవ కాంగ్రెస్సోనియల్ డిస్ట్రిక్ట్‌కు ఆమె ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు.

YES9 TV