బెంగళూరు/హుబ్బళి: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఓరకంగా కారణం అయిన ఆర్ టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వివాదాలకు దారితీస్తోంది.
మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే శక్తి పథకం అమలుకు మంచి స్పందన వస్తోంది. అయితే కొన్ని చోట్ల మహిళల పట్ల రవాణా శాఖ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో రవాణా శాఖ అప్రమత్తమై కేఎస్ ఆర్ టీసీ బస్సుల కండెక్టర్లు, డ్రైవర్లను, సిబ్బందిని హెచ్చరించింది.
మహిళా ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేఎస్‌ఆర్‌టీసీ బస్సు కండెక్టర్లు, డ్రైవర్లకు సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఓ మహిళా ప్రయాణికురాలిపై దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. కేఎస్ ఆర్ టీసీ సిబ్బంది అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఇదే సందర్బంలో కొన్ని వీడియోలు వైరల్ కావడంతో, ప్రజల ఆగ్రహం కూడా పెరిగింది, ఇప్పుడు రవాణా శాఖ అలర్ట్ అయ్యింది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో కర్ణాటక వాయువ్య కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ బస్ కండక్టర్ హుబ్బళి బస్సులో ఒక వృద్ధ మహిళను చెంపదెబ్బ కొట్టాడు. కేఎస్ ఆర్ టీసీ సిబ్బంది ప్రయాణికులతో వాగ్వాదానికి దిగడం కొత్తేమీ కాదు. కర్ణాటకలో మహిళ ఉచిత ప్రయాణం కోసం శక్తి పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇలాంటి ఘటనలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి.
ఇటీవల తుమకూరులోని నాగేనహళ్లి గేట్ నుండి బస్సు ఎక్కేందుకు బస్సును ఆపేందుకు ప్రయత్నిస్తున్న మహిళల గుంపుపై కేఎస్ ఆర్ టీసీ డ్రైవర్ మహిళల మీదకు బస్సు నడుపడానికి ప్రయత్నించడం, మహిళలను బెదిరించే రీతిలో బస్సు నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తర్వాత డ్రైవర్ ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ఘటనలకు అరికట్టడానికి కేఎస్ఆర్ టీసీ ఒక సర్క్యులర్ జారీ చేసింది.
మహిళా ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించకపోతే బస్సు డ్రైవర్లు, కండక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. సిబ్బంది తమ పనిని సమర్ధవంతంగా నిర్వహించాలని, ప్రయాణికుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని సర్క్యులర్‌లో ఆదేశించింది. ప్రతి బస్టాప్ వద్ద బస్సులను నిలపాలని, బస్సుల్లో మహిళా ప్రయాణికులను ఎక్కించుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
వృద్ధురాలిని చెంపదెబ్బ కొట్టిన కండక్టర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఓ అధికారి తెలిపారు. ప్రయాణికులు కూడా సిబ్బందికి సహకరించాలని అధికారులు మనవి చేశారు. చల్లకెరెలో ఓ మహిళతో దురుసుగా ప్రవర్తించాడన్న ఆరోపణతో బస్సు కండక్టర్‌ను సాటి ప్రయాణికులు కొట్టారు. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చిన రవాణా శాఖ అధికారులు బస్సు కండెక్టర్ తో అనుచితంగా ప్రవర్తించింది మహిళేనని స్పష్టం చేసింది. ప్రయాణికుల సంఖ్య పెరగడంతో సిబ్బందిపై ఒత్తిడి కూడా పెరిగిందని, ప్రయాణికులు కూడా రవాణా సిబ్బందితో శాంతియుతంగా ప్రవర్తించాల్సి వస్తోందని అధికారులు తెలిపారు.
