జగన్ కు ఉద్యోగ నేతల థ్యాంక్స్- సీఎం భావోద్వేగం-జీపీఎస్ పై కీలక వ్యాఖ్యలు..

ఏపీలో ఉద్యోగులు ఎప్పటినుంచో పోరాడుతున్న పలు అంశాలపై ప్రభుత్వం తాజాగా కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వైసీపీ గతంలో ఇచ్చిన హామీల మేరకు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సీపీఎస్ రద్దు, హెచ్ఆర్ఏ పెంపు వంటి నిర్ణయాల్ని కేబినెట్ ప్రకటించింది.

దీంతో ఉద్యోగ సంఘాలు దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇవాళ గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఉద్యోగ నేతలు సీఎం జగన్ ను కలిశారు.

ఇవాళ క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ అయిన ఉద్యోగ సంఘాల నేతలు.. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, జీపీఎస్‌ ప్రకడించడంపై హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల విషయంలో రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను 60 రోజుల్లోగా అమలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. కొత్తగా జీపీఎస్ ను తీసుకురావడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రభుత్వంలో ఏపీవీవీపీ ఉద్యోగుల విలీనం, పీఆర్సీ కమిషన్‌ ఏర్పాటు సహా రాష్ట్ర కేబినెట్ ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి.

ఈ సందర్భంగా జగన్ భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వం నుంచి జరగాల్సిన మంచి ఏదైనా ఉద్యోగులకు చేస్తామని జగన్ తెలిపారు. ఉద్యోగులు అనేవారు ప్రభుత్వంలో భాగస్వాములన్నారు. ఉద్యోగులు బాగుంటేనే ప్రజలు బాగుంటారని విశ్వసించిన ప్రభుత్వం మనది అని వారితో అన్నారు. మీ మనసులో కష్టం ఉండకుండా చూడాలన్నదే మా ఉద్దేశం అని వారికి వివరించారు.

YES9 TV