ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం- ఆ కార్డ్ ఉంటేనే: కండిషన్లు ఇవే

బెంగళూరు: కర్ణాటకలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో కీలకమైనది- ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.

శక్తి పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. లగ్జరీ, ఏసీ బస్సులు మినహా- మిగిలిన అన్నింట్లోనూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.

బెంగళూరు సిటీ బస్సులతో పాటు కేఎస్ఆర్టీసీ, ఈశాన్య ఆర్టీసీ, వాయవ్య ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించింది. ఈ నెల 11వ తేదీ నుంచి ఇది అమలులోకి రానుంది. ఈ శక్తి పథకానికి పాలనాపరమైన ఆమోదం లభించింది. ఈ మేరకు రవాణా శాఖ కార్యదర్శి పుష్ప వీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి శక్తి స్మార్ట్ కార్డ్‌ తప్పనిసరి. దీన్ని పొందడానికి సేవా సింధు పోర్టల్ ద్వారా దరఖాస్తులను దాఖలు చేయాల్సి ఉంటుంది. అనుమతి లభించిన మహిళలకు శక్తి స్మార్ట్ కార్డ్‌లను ప్రభుత్వం అందజేస్తుంది. కర్ణాటక భూభాగంపై తిరుగాడే ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుంది.

YES9 TV