కోల్‌కత్తా: ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషాదకర ఘటనలో దాదాపు 275 మంది ప్రయాణీకులు మృత్యువాతపడ్డారు.
ఈ నేపథ్యంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ రాష్ట్రానికి చెందిన మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
వివరాల ప్రకారం.. ఒడిషా రైలు ప్రమాదంలో బెంగాల్‌కు చెందిన ప్రయాణీకులు ఎక్కువ సంఖ్యలో మరణించడంతో పాటుగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో సీఎం మమత సోమవారం మాట్లాడుతూ.. ప్రస్తుతం బెంగాల్‌కు చెందిన ప్రయాణికుల్లో 206 మంది గాయపడ్డారు. వీరంతా ఒడిశాలోని వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ఇక, బాధితుల్లో 33 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారంతా కటక్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే, ఈ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే తమ రాష్ట్రానికి చెందిన మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అలాగే, అవయవాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సైతం ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు.
