ముఖ్య నేతలు స్పందించటం లేదు- డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు..!!

సంచలన కామెంట్స్ తో వార్తల్లో నిలిచే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. ఏ విషయం అయినా నారాయణ స్వామి ఓపెన్ గా మాట్లాడే స్వభావం.

తాజాగా చోటు చేసుకున్న పరిణామాల పైన స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా విమర్శలు చేస్తూనే సొంత పార్టీ నేతల పైనా వ్యాఖ్యలు చేసారు. తనకు జరిగిన అవమానం పైన వైసీపీ నేతలు స్పందించకపోవటం నారాయణ స్వామికి రుచించటం లేదు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి తాజాగా విచిత్ర అనుభవం ఎదురైంది. నారాయణ స్వామి ఇటీవల గంగాధర నెల్లూరు మండలం పాచిగుంట గ్రామానికి వెళ్లారు. అయితే అక్కడ డిప్యూటీ సీఎంకు తాళాలు వేసిన ఇల్లు దర్శనమిచ్చాయి. నారాయణ స్వామి వస్తున్న విషయం తెలుసుకొని ఇళ్లకు తాళాలు వేసి జనం వెళ్లిపోయారు. ఊరంతా ఖాళీ అవ్వడంతో డిప్యూటీ సీఎం నారాయణస్వామి అసహనానికి గురయ్యారు. సర్పంచ్ తో పాటు గ్రామంలో ఎవరూ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ పథకాలు పొందుతున్న ఇళ్లలో జనం ఎందుకులేరని డిప్యూటీ సిఎం అధికారులను ప్రశ్నించారు. అయితే, కావాలనే స్థానికులు వెళ్లిపోయారంటూ ప్రచారం జరిగింది.

దీని పైన నారాయణ స్వామి స్పందించారు. ఇలా ఇళ్లకు తాళాలు వేయించడం వెనుక చంద్రబాబు ఉన్నారి ఆరోపించారు. చంద్రబాబు తన సామాజికవర్గం వాళ్లకు చెప్పి ఇళ్లకు తాళాలు వేయించి ఎస్సీ ఎమ్మెల్యేలను అవమానిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. తనతో పాటుగా మరి కొందరు ఎస్సీ ఎమ్మెల్యేలకు ఇదే విధంగా అవమానాలు ఎదురైనా.. వైసీపీ ముఖ్య నేతలు స్పందించడం లేదంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. దీంతో, ఇప్పుడు స్థానికుల ఈ స్థాయిలో కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవటం వెనుక కారణం ఏంటనేది చర్చగా మారుతోంది. ఇదే సమయంలో సొంత పార్టీ నేతల పైనా నారాయణ స్వామి వ్యాఖ్యలు చేయటం జిల్లా వైసీపీలో కలకలంగా మారుతోంది.

YES9 TV