సూపర్ స్టార్ మహేష్ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అమరావతికి అటూ ఇటూ అనే టైటిల్ ను గతంలో పరిశీలించారు.
అయితే ఈ సినిమాకు పేరు మార్చినట్లు తెలుస్తోంది. గుంటూరు కారం అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 31వ తేదీన టీజర్ విడుదల చేయబోతున్నారు.
టీజర్ విడుదలతోటే టైటిల్ ను అధికారికంగా ప్రకటించబోతున్నారు. వాస్తవానికి అమరావతికి అటూ ఇటూ అనే టైటిల్ దాదాపుగా ఖాయమైందని గతంలో చిత్రవర్గాలు తెలిపాయి. అయితే టీజర్ ను కట్ చేసిన తర్వాత సినిమా చాలా మాసీగా వచ్చినట్లు తేలింది. మహేష్ బాబు క్యారెక్టరైజేషన్, సినిమా టైటిల్ కి, కట్ చేసిన టీజర్ కు ఏదీ మ్యాచ్ కాలేదు. చివరకు గుంటూరు కారం అయితే బాగుంటుందని దాన్ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో మహేష్ బాబు పక్కన పూజాహెగ్డే, శ్రీలీల కథానాయికలుగా నటించారు. తమన్ స్వరాలందిస్తున్నారు. మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో వీరిద్దరూ అతడు, ఖలేజా చేశారు. ఈ రెండు సినిమాల్లోను మహేష్ క్యారెక్టరైజేషన్ కొత్తగా అనిపించేలా త్రివిక్రమ్ డిజైన్ చేశారు. అలాగే ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలోను మహేష్ బాబు క్యారెక్టరైజేషనే హైలైటవబోతోందన్నది తెలుస్తోంది.
SSMB28 పేరుతో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ కథానాయకుడు అక్షయ్ కుమార్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. అక్షయ్ కోసం త్రివిక్రమ్ ఒక బలమైన పాత్ర రాశాడని టాక్. అది విలన్ పాత్రా? లేదంటే మరేదైనా పాత్రా? అనేది తెలియాల్సి ఉంది. 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా అభిమానుల కోసం ఆరోజే టీజర్, టైటిల్ విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే చేతిలో బీడీ పెట్టుకొని తలకు ఎర్ర తువ్వాలుతో మహేష్ బాబు ఫొటోను చిత్ర యూనిట్ విడుదల చేయగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది
