మోదీ ప్రసంగానికి సిడ్నీ జేజేలు..ఏం చెప్పారంటే..?

సిడ్నీ: భారత్ ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు రోజురోజుకూ మెరుగవుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. సిడ్నీలో భారత సంతతి వారిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.

కామన్‌వెల్త్, కర్రీ, క్రికెట్ ఈ మూడు దేశాలను కలుపుతున్నాయని చెప్పిన ప్రధాని… ప్రపంచంలో ఎక్కడ ఆపద ఉన్న భారత్‌ అక్కడ ప్రత్యక్షమై సహాయం అందిస్తోందని చెప్పారు.

కరోనా సమయంలో భారత్ వ్యాక్సినేషన్ హబ్‌గా అవతరించిందని గుర్తు చేసిన ప్రధాని మోదీ.. ఆ సమయంలో ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్‌ను అందజేశామని చెప్పారు. రెండు దేశాల మధ్య మైగ్రేషన్ పై ఒప్పందం జరిగిందని చెప్పిన మోదీ… ఇది ఇరుదేశాల విద్యార్థులకు ఎంతో ఉపయుక్తకరంగా మారుతుందని చెప్పారు.

పర్యావరణ పరిరక్షణకోసం భారత్ సౌర విద్యుత్‌ను ప్రోత్సహిస్తోందని చెప్పారు. టర్కీలో భూకంపం వచ్చినప్పుడు భారత్ సహాయం చేయడంలో ముందుందని చెప్పిన ప్రధాని మోదీ ఆపద సమయాల్లో భారత్ ఎప్పుడూ ముందుంటుందని వెల్లడించారు. ఎనర్జీ, ఎకానమీ, ఎడ్యుకేషన్‌లు భారత్ ఆస్ట్రేలియాలను కలుపుతున్నాయని పేర్కొన్నారు. త్వరలోనే బ్రిస్బేన్‌లో భారత కాన్సులేట్‌ను ప్రారంభించనున్నట్లు ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

ఇక మోదీ ప్రసంగిస్తున్నంత సేపు ప్రాంగణమంతా నమో నినాదాలతో మారుమ్రోగిపోయింది. 2014లో ప్రధానిగా తొలిసారి బాధ్యతలు చేపట్టాక నాటి ఆస్ట్రేలియా జ్ఞాపకాలను మోదీ నెమరేసుకున్నారు. ఒక భారత ప్రధాని ఆస్ట్రేలియాకు వచ్చేందుకు 28 ఏళ్లు వేచిచూడక్కర్లేదని నాడు చెప్పిన మాటలను ఈసందర్భంగా మోదీ గుర్తు చేస్తూ మళ్లీ తానే ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు.

భారత్‌ క్రమంగా ఆర్థికశక్తిగా ఎదుగుతోందని చెప్పిన ప్రధాని.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వెలుగొందుతోందని ఐఎంఎఫ్ చెప్పినట్లు మోదీ గుర్తుచేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు కూడా భారత్ స్థిరమైన ఆర్థిక వ్యవస్థగా ఉన్నిందని ప్రపంచ బ్యాంక్ కితాబు ఇచ్చినట్లు మోదీ తెలిపారు. కష్ట సమయాల్లో కూడా భారత్ రికార్డు స్థాయిలో ఎగుమతులను నమోదు చేసిందని చెప్పిన మోదీ… చాలా దేశాల్లో బ్యాంకింగ్ వ్యవస్థ అస్తవ్యస్తమైనప్పటికీ, భారత బ్యాంకింగ్ వ్యవస్థ మాత్రం పటిష్టంగా ఉందని పలు దేశాలు ప్రశంసించినట్లు చెప్పారు.

YES9 TV