మేము ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) ఆఫిస్ నుంచి మాట్లాడుతున్నామని ఫోన్ వస్తే ఎవరూ నమ్మరు. ప్రాంక్ అనుకుంటారు. కానీ..
అదే నిజమని తెలిస్తే.. ‘అబ్ దిల్లీ దూర్ నహీ’ (Ab delhi door nahi) చిత్ర బృందానికి ఇదే అనుభవం ఎదురైంది. ముఖేశ్ అంబానీ ఆఫీస్ నుంచి.. ‘మా సర్ మీ సినిమాను అంటిల్లా (అంబానీ నివాసం)లో (Antilia) చూడాలనుకుంటున్నారు. స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తారా’ అనే కాల్ వచ్చింది. ప్రాంక్ కాల్ అనుకుని అఫీషియల్ మెయిల్ నుంచి సమాచారం వస్తే చూద్దామని చెప్పింది యూనిట్. నిజంగానే మెయిల్ వచ్చేసరికి ఒక్కసారిగా షాకై తర్వాత ఆనందంలో మునిగిపోయారు.
సినిమాలో హీరో ఇమ్రాన్ జాహిద్ (Imran zahid) మాట్లాడుతూ.. ‘సినిమా ఎంతోమందికి స్ఫూర్తినిస్తుందని భావించాం. కానీ.. ముఖేశ్ అంబానీకే నచ్చడం నిజంగా గొప్ప విషయం. ఫోన్ కాల్ నిజమని తెలిసి కాసేపు నమ్మలేకపోయా’మని చెప్పుకొచ్చాడు. బీహార్ కు చెందిన రిక్షా కార్మికుడి కుమారుడు గోవింద్ జైశ్వాల్ అనే యువకుడు సివిల్స్ సాధించేందుకు పడిన కష్టాన్ని దర్శకుడు కమల్ చంద్ర సినిమాగా తెరకెక్కించారు. మే12న విడుదలైన సినిమా ప్రజాదరణ పొందుతోంది.
