కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి, సీఎం కుర్చీ నీకా ?, నాకా ? అంటూ మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే.
శివకుమార్ పోటీ పడుతున్నారు. ఇదే సమయంలో మాజీ మంత్రి డీకే. శివకుమార్ చెప్పిన మాటలతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల దిమ్మతిరిగిపోయింది.
డీకే శివకుమార్ సోమవారం మద్యాహ్నం ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. హెచ్ఏఎల్ నుంచి ప్రత్యేక విమానంలో సిద్దరామయ్య ఢిల్లీ వెళ్లిపోయారు. అయితే డీకే శివకుమార్ మాత్రం బెంగళూరులోనే ఉండిపోయారు. ఈ రోజు మే 15వ తేదీ డీకే శివకుమార్ బర్త్ డే. పుట్టిన రోజు సందర్బంగా డీకే శివకుమార్ కుటుంబ సభ్యులు ఇంట్లో ప్రత్యేక పూజలు చేశారు.
సోమవారం రాత్రి డీకే శివకుమార్ ఢిల్లీ వెలుతారని ఆయన సన్నిహితులు మీడియాకు మ్యాటర్ లీక్ చేశారు. అయితే రాత్రి డీకే శివకుమార్ బాంబు పేల్చారు. తనకు కడుపు నొప్పిగా ఉందని, ప్రయాణం చెయ్యకుండా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు సమాచారం అందించారు.
కర్ణాటక సీఎం పదవి కోసం మాజీ సీఎం సిద్దరామయ్య సోనియా గాంధీకి ఎంతో నమ్మకస్తుడు అయిన కేసీ వేణుగోపాల్ ను ప్రసన్నం చేసుకుని తనకు సీఎం పదవి ఇప్పించాలని వేడుకున్నారు. సిద్దరామయ్యకు సీఎం సీటు ఇప్పించాలని కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారని తెలుసుకున్న డీకే శివకుమార్ షాక్ అయ్యారని తెలిసింది.
