లండన్: బ్రిటన్ రాజధాని లండన్ నగరంలోని హౌంస్లౌ ప్రాంతంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ 22వ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా కోరుట్ల ఎమ్మల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, విశిష్ట అతిధిగా ఎఫ్దీసి చైర్మన్ అనిల్ కూర్మాచలం పాల్గొన్నారు. ముందుగా జయశకంర్ చిత్ర పటానికి పూలు వేసి, అమరవీరులని స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసి.. “దేశ్ కి నేత కెసిఆర్” అంటూ నినదించారు.
ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ.. పార్టీ నాయకులకు కార్యకర్తలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారై బీఆర్‌ఎస్ సభ్యులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కి, వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కి పార్టీలో పని చేసే అవకాశం కల్పించినందుకు కృతఙ్ఞతలు తెలిపారు.
ఎలాగైతే ఉద్యమ సమయం నుంచి నేటి వరకు కెసిఆర్ వెంట ఉన్నామో అలాగే నేడు కూడా దేశ గతిని మార్చే పోరాటంలో సైతం కేసీఆర్ వెంటే ఉంటామని అశోక్ తెలిపారు.
ఎఫ్దీసి చైర్మన్, ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం ఒక చరిత్ర అని, ఒక నాడు తెలంగాణ రాష్ట్ర సాధనకై బయలుదేరిన గులాబీ జెండా నేడు కెసిఆర్ నాయకత్వంలో దేశ నలుమూలల ఎగరాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని, తెలంగాణ మోడల్ దేశమంతా కావాలని ఆకాంక్షిస్తున్నారని అనిల్ తెలిపారు.
