టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ( Virat kohli)ని ఐపీఎల్ ( IPL) లో ఆడించేందుకు ఓ ఫ్రాంచైజీ వద్దందట.
కోహ్లీని తీసుకునేందుకు పోటీ పడుతుంటారు కదా అలాంటిది ఏ ఫ్రాంచైజీ వదులుకుందబ్బా! అని ఆశ్చర్యపోతున్నారా ? కోహ్లీ నే స్వయంగా ఈ విషయం చెప్పాడు. తాజాగా రాబిన్ ఊతప్ప కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ ఈ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
‘ ఆర్సిబి అంటే నాకు చాలా ఇష్టం. ఆ జట్టులో చేర్చుకున్న తొలినాళ్లలో నాకు బాగా సపోర్ట్ చేశారు. అలా వాళ్లతో నాకు విడదీయలేని బంధం ఏర్పడింది. కొన్ని రోజులపాటు నేను గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నాను.ఆ సమయంలోను ఆర్సిబి యాజమాన్యం నన్ను వదిలిపెట్టింది లేదు. ప్రతి ఏటా వేలం జరిగేటప్పుడు నన్ను రీటైన్ చేసుకుంటామని ముందుగానే చెప్పేవారు. టీమిండియాలో మాదిరిగానే టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేస్తానని చెప్పినప్పుడు నా మాటకు గౌరవం ఇచ్చారు. నా మీద ఎంతో నమ్మకం ఉంచి నాకు కావాల్సిన స్వేచ్ఛ ఇచ్చారు’ అని అన్నాడు.
‘కొన్నేళ్ల క్రితం నేను ఓ ఫ్రాంచైజీ ని సంప్రదించాను. నేనేం చెబుతున్నాను వినలేదు సరి కదా వాళ్లు నాకు కనీస గౌరవం ఇవ్వలేదు. టాప్ ఆర్డర్ లో ఆడతాను అంటే నా మాట పట్టించుకోలేదు. 2011లో నేను అద్భుతమైన ఫామ్ లో ఉన్నప్పుడు ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం నా దగ్గరకు వచ్చింది. వేలంలో పాల్గొనాల్సిందిగా రిక్వెస్ట్ చేసింది. పేరయితే చెప్పను గాని ఆ యాజమాన్య అభ్యర్థనని మొహమాటం లేకుండా తిరస్కరించాను. నేను ఎప్పటికీ ఆర్సిబీ తోనే ఉంటానని వాళ్లతో చెప్పాను’ అని చెప్పుకొచ్చాడు.
అయితే కోహ్లీ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోహ్లీని ఏ జట్టు యాజమాన్యం వదులుకుందా?అని నెటిజన్స్ ఆరాలు తీస్తున్నారు.
