పాత పెన్షన్ విధానం కోసం ఉద్యోగులు గళమెత్తారు.
ఇవాళ తెలంగాణవ్యాప్తంగా భారీగా ర్యాలీలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో 33 జిల్లాల్లో ‘పెన్షన్ కాన్స్టిట్యూషనల్ మార్చ్ ‘ ను నిర్వహించారు. ఇక హైదరాబాద్ లో తలపెట్టిన కార్యక్రమంలో ఎన్.ఎం.ఓ.పి.యస్( National Movement for Old Pension Scheme) సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ పాల్గొన్నారు. ఎల్బీ స్టేడియం నుంచి లిబర్టీ పాదయాత్రకు వెళ్లారు. అక్కడ అంబేడ్కర్ విగ్రహనికి నివాళులు అర్పించి… వినతిపత్రం సమర్పించారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ సీపీయస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్,కోశాధికారి నరేష్ గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ….ఎన్.ఎం.ఓ.పి.యస్ ఆధ్వర్యంలో పాత పెన్షన్ విధానం కోసం దేశవ్యాప్తంగా ‘పెన్షన్ కాన్స్టిట్యూషనల్ మార్చ్’ను నిర్వహించామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాల యొక్క హక్కులను పిఎఫ్ఆర్డీఏ చట్టం కాలరాస్తుందని విమర్శించారు. అలాంటి చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా తాజాగా సీపీఎస్ పై కేంద్రం వేసిన కమిటీలో పీఎఫ్ఆర్డీఏ ఛైర్మన్ ఉండటమేంటని ప్రశ్నించారు. అలాంటి కమిటీపై విశ్వసనీయత ఉండే అవకాశం లేదన్నారు. దీనిపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పునరాలోచించాలని స్పష్టం చేశారు.
ఇక తెలంగాణలోని 1,72,000 సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయుల సొమ్ము దాదాపు 20 వేల కోట్లు షేర్ మార్కెట్లో చలామణి అవుతున్నాయని స్థిత ప్రజ్ఞ చెప్పారు. వాటిని తిరిగి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చేలా చూడాలని, ఉద్యోగుల పెన్షన్ ఖాతాలో జమయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాబోయేరోజుల్లో తమ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు. సి.పి.ఎస్ పై జులైలో సంకల్ప రథయాత్ర జరుపుతామని ప్రకటించారు. హైదరాబాద్ కేంద్రంగా ఆగస్టులో ‘రాజకీయ రణరంగ మహాసభ’ కూడా నిర్వహిస్తామని వెల్లడించారు. అక్టోబర్ 1వ తేదీన ఢిల్లీలోని రాంలీల మైదానంలో పెన్షన్ శంఖ్ నాథ్ కార్యక్రమాన్ని తలపెడతామని అన్నారు.
గత 19 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వాలు వేధిస్తున్నాయని స్థిత ప్రజ్ఞ మండిపడ్డారు. పాత పెన్షన్ అమలు చేయాలని ఏకైక డిమాండ్ తో ఇవాళ అన్ని జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించామని చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 309 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సామాజిక భద్రతను కల్పించాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలదే అని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ మాట్లాడుతూ… గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పులను పరిశీలించాలని.. అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు కూడా నడుచుకోవాలని కోరారు. ఇక జిల్లాల్లో చేపట్టిన ర్యాలీల్లో ఉద్యోగులు భారీగా పాల్గొన్నారు. ఎండను లెక్క చేయకుండా.. పెన్షన్ మార్చ్ లో పాల్గొని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
